అతి తక్కువ ధరకే సోలార్ సైకిల్.. !

Suma Kallamadi
దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ ఇంధనాల ద్వారా నడిచే వాహనాల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడటంతో పాటు పర్యావరణానికీ తీవ్రనష్టం కలుగుతోంది. ఈ క్రమంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పూనుకున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా మెల్లగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఇద్దరు పిల్లలు ఎలక్ట్రిక్ సైకిల్ రూపొందించారు. పునరుత్పాదక శక్తి సూర్యరశ్మి ద్వారా ఈ సైకిల్ నడుస్తుండటం విశేషం. కాగా, వారి వినూత్న ఆవిష్కరణపై స్పెషల్ స్టోరీ.
తమిళనాడులోని శివగంగై కాలేజీ రోడ్‌కు చెందిన చెందిన ఇద్దరు అన్నదమ్ములు వినూత్న ఆవిష్కరణ చేశారు. వీరపతిరన్, అమాని దంపతుల కుమారులైన 12  ఏళ్ల వీరగురుహరికృష్ణన్, 11 ఏళ్ల సంపత్కృష్ణన్ ఎకోఫ్రెండ్లీ ఆవిష్కరణ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరగురుహరికృష్ణన్ తిరుపువనంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతుండగా, సంపత్కృష్ణన్ శివగంగై స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్  టైంలో ఎలాగూ స్కూల్స్ క్లోజ్ చేయబడి ఉండగా, ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లోనే ఉండిపోయారు. ఇక బయటకు వెళ్తేందుకు గాను సైకిల్ యూజ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల గురించి వారికి తెలిసింది. పెట్రోల్ లేకుండా నడిచే వెహికల్స్ మనం ఎందుకు తయారు చేయలేం? అనే ఆలోచన వారికి వచ్చింది. అందుకు తమ దగ్గర ఉన్న సైకిళ్లు వాడుకోవాలనుకున్నారు. వాటి ద్వారానే ఏదైనా ఆవిష్కరణ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే సోలార్ శక్తి ఉపయోగించి నడిచే సైకిల్ రూపొందించాలనుకున్నారు. సూర్యుడి శక్తితో నడిచే సైకిల్ రూపొందించాలనుకుని, అందుకు కావాల్సిన పరికరాల కోసం ఆన్‌లైన్, స్థానిక దుకాణాల‌లో సెర్చ్ చేశారు. మోటారు, బ్యాటరీ, సోలార్‌ ప్లేట్లు తీసుకుని, వాటన్నిటినీ సక్రమంగా అమర్చి సోలార్ సైకిల్‌ను ఆవిష్కరించారు. సోలార్ బ్యాటరీని ఐదు గంటల పాటు చార్జింగ్‌ పెట్టాలి. ఇది ఒక్క చార్జ్‌తో 30 కిలోమీటర్ల వరకు పయనించగలదు. సైకిల్ తయారీకి రూ.పదివేలు ఖర్చయినట్లు వారు తెలిపారు. ఈ సోలార్ సైకిల్ వార్త ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: