17 ఏళ్ల అమ్మాయి ప్రేమ విషయమై తల్లిదండ్రుల దేశ బహిష్కరణ...

SS Marvels
ఫ్రాన్స్‌లో బోస్నియాకు చెందిన 17 ఏళ్ల ఓ మైనర్ అమ్మాయికి శిరోముండనం చేసిన ఘటన ఆ దేశంలో ప్రకంపనలు రేపింది. వేరే దేశానికి, మరో మతానికి చెందిన యువకుడిని ప్రేమించిన కారణంగా ఆ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు, బంధువులు కలిసి శిరోముండనం చేశారు. ఆమెను ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. దీన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అమ్మాయి తల్లిదండ్రులతో పాటు మరో ముగ్గురిని పోలీసులు శుక్రవారం (అక్టోబర్ 23) అరెస్టు చేశారు. అమ్మాయి తల్లిదండ్రులతో పాటు మొత్తం ఐదుగురు నిందితులను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే బోస్నియా దేశానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం రెండేళ్ల కిందట ఫ్రాన్స్‌లోని బెసాన్‌కాన్‌ నగరానికి వచ్చి అక్కడే నివాసం ఉంటోంది. ఈ కుటుంబానికి చెందిన 17 ఏళ్ల మైనర్‌ బాలికకు అదే భవనంలో ఉంటున్న సెర్బియా దేశానికి చెందిన 20 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్న వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆ వారిద్దిరికీ పెళ్లి జరిపించడానికి యువతి కుటుంబం తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీంతో ఆ ప్రేమికులిద్దరూ కొన్ని రోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయారు. ఆ తర్వాత నాలుగు రోజులకు మళ్లీ ఇంటికి తిరిగి వచ్చారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన యువతి కుటుంబం మరో మతానికి చెందిన యువకుడిని ఎలా ప్రేమిస్తావ్ అంటూ ఆ అమ్మాయిని చిత్ర హింసలకు గురిచేసింది. ఆమెను ఇంట్లో బంధించి, ఫోన్ లాగేసుకొని శారీరకంగా హింసించారు.
యువతికి సొంత కుటుంబీకులే గుండు గీయించారు. చిత్ర హింసలకు గురి చేయడంతో అస్వస్థతకు గురి కావడంతో ఆమెను హాస్పిటల్‌లో చేర్పించారు. దీంతో ఈ విషయం పోలీసులు, మీడియా దృష్టికి వచ్చింది. ఆగస్టులో ఫ్రెంచ్‌ మీడియా ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చింది. ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. బెసాన్‌కాన్‌ న్యాయస్థానం ఈ కేసును విచారిస్తోంది.
మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంతో అమ్మాయిని తీవ్రంగా కొట్టడం, శిరోముండనం చేయడం లాంటి చర్యలను తీవ్రమైన నేరంగా భావిస్తున్నట్లు బెసాన్‌కాన్ న్యాయస్థానం పేర్కొంది. విచారణలో భాగంగా యువతి తల్లిదండ్రులతో పాటు మరో ముగ్గురు సమీప బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డట్లు గుర్తించింది. దోషులకు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
దోషులను ఇప్పటికే బెసాన్‌కాన్‌ నగరం నుంచి బోస్నియా రాజధాని సరజెవోకు తరలించారు. అమ్మాయి తల్లిదండ్రులను ఐదేళ్ల పాటు దేశం నుంచి బహిష్కరించారు. అయితే.. అమ్మాయి దగ్గరి బంధువులైన ఇద్దరు దంపతులకు మాత్రం శరణార్థుల స్టేటస్ ఇచ్చి అక్కడే నివసించే వెసులుబాటు కల్పించారు. ఆ దంపతులిద్దరే తనకు శిరోముండనం చేశారని కేసు విచారణలో భాగంగా బాధిత యువతి తెలిపింది. యువతి తల్లిదండ్రులు మాత్రం దేశం విడిచి వెళ్లిపోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: