ఇండియా.. అమెరికా చేయి కలిపితే.. అదిరిపోయే ఫలితాలు..!?

అంతరిక్ష రంగంలో అమెరికాదే అగ్రస్థానం.. ఆ తర్వాత స్థానంలో చైనా, ఇండియా వంటి దేశాలు ఉన్నాయి. ఇండియా ఇప్పుడు అనేక ఉపగ్రహాలను రోదసిలోకి పంపుతూ అగ్ర దేశాల సరసన నిలుస్తోంది. అమెరికా రోదసి విజయాల్లో నాసాదే కీలకపాత్ర.. ఇక ఇండియాలో రాకెట్ ప్రయోగాలకు చిరునామా ఇస్రో.. మరి ఇప్పుడు ఈ రెండు దేశాలు చేతులు కలిపితే ఎలా ఉంటుంది. ఓ ప్రత్యేక లక్ష్యం కోసం ఈ రెండు దేశాల స్పేస్‌ సంస్థలు చేయి కలిపాయి. ఓ అద్భుతం సాకారం చేయబోతున్నాయి.

అవును.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి అత్యంత హై రెజల్యూషన్‌ చిత్రాలు తీసే సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌.. ఎస్‌ఏఆర్‌ను ఇస్రో  ఇప్పుడు అభివృద్ధి చేసింది. సంయుక్త భూ పరిశోధన మిషన్‌ కోసం ఈ రాడార్‌ను ఇరుదేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు దీన్ని డెవలప్ చేశాయి. ఈ వ్యవస్థకు ఏం పేరు పెట్టారో తెలుసా..  నాసా-ఇస్రో  ఈ రెండు పేర్లు కలిసి వచ్చేలా  నిసార్‌ అని పేరు పెట్టారు.

ఇంతకీ ఈ నిసార్ ఏం చేస్తుంది.. ఇది భూ పరిశోధన కోసం ఉపయోగపడుతుంది. ఎల్‌ఎస్‌ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీ ఉపగ్రహాల్లో ఉపయోగించేలా  దీన్ని రూపొందించారు. ఈ నిసార్ ద్వారా  భూమిపై సెంటీ మీటర్‌ కంటే తక్కువ వైశాల్యాన్ని కూడా కచ్చితంగా గుర్తించవచ్చు.. దీని ద్వారా కొలవచ్చు. అయితే ఈ నిసార్‌ ఆలోచన ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదు.. ఆరేడు ఏళ్ల క్రితమే దీన్ని  అభివృద్ధి చేసేందుకు ఇస్రో నాసాతో ఒప్పందం చేసుకుంది.

ఇక ఈ నిసార్‌ను వచ్చే ఏడాది శ్రీహరికోట నుంచి ప్రయోగించే ఉపగ్రహంలో ఉపయోగిస్తారు. ఈ నిసార్ కోసం  ఎల్‌ బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌తోపాటు సైన్స్‌ డేటా కోసం హైరేట్‌ కమ్యూనికేషన్‌ సబ్‌ సిస్టమ్‌, జీపీఎస్‌ రిసీవర్లు, సాలిడ్‌ స్టేట్‌ రికార్డర్‌, పెలో డేటా సబ్‌సిస్టమ్‌లను నాసా సమకూరుస్తోంది. ఇక ఇస్రో..  వాహక నౌక ఎస్‌ బ్యాండ్‌ రాడార్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అవసరమైన సేవలను సమకూరుస్తోంది. ఇండియా, అమెరికా  చేయి కలిపితే.. ఇలా సంయుక్తంగా టెక్నాలజీ రంగంలో అద్భుతాలు సృష్టించొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: