ఇయర్ ఫోన్స్‌తో తిప్పలు.. వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..
కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రం హోం ఎక్కువైపోయింది. ఉద్యోగస్తులు ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా ఇళ్ల నుంచే ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. ఈ క్రమంలో ఇయర్ ఫోన్ల వాడకం తప్పనిసరిగా మారింది. ఇదే ఇప్పుడు ఎంతోమందిలో చెవి సమస్యలకు దారి తీస్తోంది. హెడ్‌ఫోన్స్, ఇయర్ పాడ్స్‌ను ఎక్కువ సేపు పెట్టుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. గడచిన ఏడెనిమిది నెలల్లో చెవి సమస్యలతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు.
ఇటీవలి కాలంలో చెవి సమస్యలతో బాధ పడుతున్న వారు పెరిగారని, తమ వద్దకు ప్రతిరోజూ 5 నుంచి 10మంది ఈ సమస్యలతో వస్తున్నారని ముంబైలోని జేజే హాస్పిటల్‌లో చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) నిపుణులు, డాక్టర్ శ్రీనివాస్ చవాన్‌చెప్పారు. ‘‘సౌండ్ ఎక్కువగా పెట్టుకొని ఇయర్‌ఫోన్లలో శబ్దాలను వినడం. అది కూడా గంటల తరబడి వినడమనేది వినికిడి శక్తిని బలహీనం చేస్తుంది. ఈ అలవాట్లను మార్చుకోకపోతే.. శాశ్వతంగా చెవిటి వారు అయిపోయే ప్రమాదం కూడా ఉంది. చెవుల్లోని గుబిలి సహజంగా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కవచంలా పనిచేస్తుంది. కానీ చాలామంది దాన్ని తొలగిస్తుండటంతో చెవులపై సులువుగా ఇన్ఫెక్షన్లు దాడి చేస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.
‘‘అసలు స్కూల్ విద్యార్థులకు ఇయర్ ఫోన్లు వాడాల్సిన అవసరం లేదు. ల్యాప్‌టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్లలో వచ్చే స్పీకర్ సౌండ్ వారు క్లాసులు వినడానికి సరిపోతుంది. కానీ వారు ఇయర్ ఫోన్స్ వాడుతూనే ఉన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే స్కూళ్లు తెరిచే సమయానికి చాలామంది పిల్లల్లో వినికిడి సమస్యలు తలెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది’’ అని మరో ప్రముఖ వైద్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇయర్ ఫోన్స్ సాధ్యమైనంత తక్కువగా ఉపయోగిస్తే మంచిదని వీరు సూచిస్తున్నారు.