టెక్నాలజీ: ల్యాండ్ లైన్ నంబర్ తో వాట్సాప్ ఎలా యూజ్ చేయాలో తెలుసా..??
వాట్సాప్.. నేటి తరానికి పరిచయం అక్కర్లేని పేరు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత చాలా మంది మొదట వాట్సాప్‌నే డౌన్‌లోడ్ చేస్తారంటే అతిశయోక్తి కాదు. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ సులువుగా ఉండడంతో అందరూ వాట్సాప్‌నే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే మొబైల్ నంబర్ ఉంటే దాని ద్వారా వాట్సాప్ లో అకౌంట్ క్రియేట్ చేసి ఉపయోగించవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. కానీ, ల్యాండ్ లైన్ నంబర్‌తోనూ వాట్సాప్ యూజ్ చేయవచ్చు అన్నది చాలా తక్కువ మందికే తెలుసు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
అందుకు ముందుగా ల్యాండ్ లైన్ నంబర్ ఉన్న ఫోన్ ను అందుబాటులో ఉంచుకోండి. ఆ తర్వాత ప్లేస్టోర్ నుంచి వాట్సాప్ బిజినెస్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి వాట్సాప్ ఇన్ స్టాల్ అయ్యాక ఓటీపీ ఆధారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టాట్ అవుతుంది. అక్కడ మీరు దేశంగా ఇండియాను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇండియా కోడ్ అయిన +91 కనిపిస్తుంది. ఇప్పుడు ఎస్టీడీ కోడ్, తర్వాత మీ ల్యాండ్ లైన్ నంబర్ ను అక్కడ ఇవ్వండి. కానీ మీ ఎస్టీడీ కోడ్ ముందు 0 ను తీసివేయాలి.
మీరు నంబర్ ఇచ్చిన అనంతరం వాట్సాప్ బిజినెస్ మీ నంబర్ కు ఒక ఓటీపీ పంపుతుంది. అయితే మీరు ఇచ్చింది ల్యాండ్ లైన్ నంబర్ కాబట్టి మీకు ఓటీపీ రాదు. అక్కడ ఓటీపీకి ఇచ్చిన టైమ్ ఎక్స్ పైర్ అయ్యేవరకు వెయిట్ చేసి ఓటీపీ కోసం ‘కాల్ మీ’ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. తర్వాత మీ ల్యాండ్ లైన్ నంబర్ కు ఒక కాల్ వస్తుంది. ఓటీపీని ఆ కాల్ ద్వారా మీకు తెలుపుతారు. ఇప్పుడు అక్కడ ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత ప్రక్రియ అంతా ఇంక మామూలుగానే ఉంటుంది. ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక మీరు మీ ల్యాండ్ లైన్ నంబర్ తో వాట్సాప్ ను యూజ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా ల్యాండ్ లైన్ నంబర్ తో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.