2025-27 WTC షెడ్యూల్ రిలీజ్.. భారత్ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడో చూసేయండి..
ఇక అందరి కళ్లు నెక్స్ట్ డబ్ల్యూటీసీ సైకిల్‌పైనే ఉన్నాయి. 2025-27 సైకిల్ షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ కొత్త సైకిల్ 2025 జూన్‌లోనే ప్రారంభమవుతుంది. భారత్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనతో ఈ సైకిల్‌కు శ్రీకారం చుట్టనుంది. ఐదు టెస్ట్‌ల ఈ సిరీస్‌తో టీమిండియా తమ డబ్ల్యూటీసీ ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ 2025 జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగనుంది. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత, శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే, వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.
డబ్ల్యూటీసీ ఫార్మాట్ ప్రకారం, ప్రతి జట్టు ఆరు సిరీస్‌లు ఆడుతుంది. అందులో మూడు సొంతగడ్డపై, మూడు విదేశాల్లో ఉంటాయి. ఈ లెక్కన చూస్తే, 2025-27 సైకిల్‌లో భారత జట్టు స్వదేశంలోనూ, విదేశాల్లోనూ సిరీస్‌లు ఆడనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను పరిశీలిస్తే..
జూన్-ఆగస్ట్ 2025: ఇంగ్లాండ్ vs భారత్ (5 టెస్ట్‌లు)
అక్టోబర్ 2025: భారత్ vs వెస్టిండీస్ (2 టెస్ట్‌లు)
నవంబర్ 2025: భారత్ vs దక్షిణాఫ్రికా (2 టెస్ట్‌లు)
ఆగస్ట్ 2026: శ్రీలంక vs భారత్ (2 టెస్ట్‌లు)
అక్టోబర్ 2026: న్యూజిలాండ్ vs భారత్ (2 టెస్ట్‌లు)
జనవరి-ఫిబ్రవరి 2027: భారత్ vs ఆస్ట్రేలియా (5 టెస్ట్‌లు)
ఈ షెడ్యూల్ ప్రకారం, 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత జట్టు మొత్తం 18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, ఈసారి భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు మధ్య మ్యాచ్‌లు లేకపోవడం గమనార్హం.
ఇతర జట్ల విషయానికి వస్తే, ఆస్ట్రేలియా అత్యధికంగా 22 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇంగ్లాండ్ 21 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు మాత్రం కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాయి. న్యూజిలాండ్ 16 టెస్ట్‌లు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు 14 మ్యాచ్‌లు ఆడతాయి. పాకిస్థాన్ జట్టు 13 మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తానికి, ఈ డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ 2027 జూన్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులకు ఏయే జట్లు ఎప్పుడు తలపడతాయో స్పష్టంగా తెలిసిపోయింది.