నరేంద్ర మోడీ స్టేడియంలో దయ్యం ఉందా.. పాక్ మాజీ కామెంట్స్?
తాము కేవలం నాకౌట్ మ్యాచ్లను తప్ప.. మిగతా లీగ్ మ్యాచ్లను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడలేము అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇక వేదికను మార్చాలి అంటూ మొండిపట్టుతో కూర్చుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ అహ్మదాబాద్ లో ఆడేందుకు ఎందుకు నిరాకరిస్తుందో అర్థం కావట్లేదు. అక్కడ ఏమైనా నిప్పుల వర్షం కురుస్తుందా లేదా అహ్మదాబాద్ మైదానంలో ఏమైనా దయ్యం ఉందా?
అనవసర రాద్ధాంతాలు చేయకుండా అహ్మదాబాద్ వెళ్లి గెలిచి రండి.. భారత్ తమకు ఎక్కడ సౌకర్యవంతంగా ఉంటే అక్కడే మ్యాచులు నిర్వహిస్తుంది. అది మనకు అవసరం. వాళ్ళు కోరుకున్న పిచ్ పై ఆడి భారత అభిమానులు ముందు మ్యాచ్ గెలవాలి. అలా సాధించిన గెలుపే అసలైన విజయం అనిపించుకుంటుంది అంటూ షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. అయితే అటు ఆసియా కప్ నిర్వహణ విషయంలో భారత్ మొండి పట్టుతో ఉన్న కారణంగానే పాకిస్తాన్ కూడా ఇలాంటి కండిషన్లు పెట్టిందని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒప్పుకుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 7 వరకు శ్రీలంక, పాకిస్తాన్ వేదికలుగా ఆసియా కప్ జరగబోతుంది.