నిప్పులాంటి నిజం: ఆ రాజుగారి గోడు కరెక్టేగా..?

Chakravarthi Kalyan
నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. మనది ప్రజాస్వామ్యం.. అంటే ప్రజలు ఎన్నుకున్న వాడే ప్రభువు.. జనం ఎవరిని మెచ్చితే అతడే పాలకుడు.. వినడానికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవం ఎలా ఉంటుంది.. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటున్నారు.. అసలు ప్రజలు ఎవరినైనా ఎన్నుకునే ముందు.. దాన్ని ఒక సీరియస్ వ్యవహారంగా తీసుకుంటున్నారా.. మనం వేసే ఓటు మన జీవితాలను మారుస్తుందని భావిస్తున్నారా.. లేక డబ్బు తీసుకునో.. అభిమానంతోనో ఓటు వేసేస్తున్నారా.. ఈ అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.


తాజాగా విజయవాడలో జరిగిన బీజేపీ ప్రజాగ్రహసభలో ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఓ మాట అన్నారు. ఈ జనం తీర్పు అర్థం కావడం లేదు.. తనపై 31 కేసులున్న వ్యక్తికి ప్రజలు సీఎం పోస్టు ఇచ్చేసారు.. కానీ.. ఒక్క కేసూ లేని నన్ను ఓడించి ఇంటికి పంపారు అని  విష్ణుకుమార్‌
రాజు బాధపడ్డారు. ఈ మాటలు సెటైరిక్‌ గా కాస్త ఉన్నా.. ఈ మాటల వెనుక ఎంతో వాస్తవం ఉంది. జనం అసలు ఓటేసే ముందు ఆలోచిస్తున్నారా.. మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం అన్న స్పృహ ఉంటుందా అన్న ఆందోళన కలుగుతోంది.


అయితే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి.. అసలు ప్రజలకు ఎన్నుకునేందుకు మంచి అవకాశం ఉంటే కదా.. రాజకీయాల్లో ఉన్నవారంతా అవినీతిపరులు, నేరగాళ్లు, పోలీసులు కేసులు ఉన్నవాళ్లే అయితే వారి నుంచే కదా జనం ఎన్నుకోవాలి.. పోనీ.. ఓ మంచి వ్యక్తి నిలుచుకున్నాడు కదా అని ఓటేస్తే అసలు ఆ వ్యక్తి గెలిచే అవకాశం ఉందా.. ఎలాగూ గెలవడని తెలిసిన వ్యక్తికి జనం ఓటేస్తారా.. అసలు ఓ నిజాయితీ ఉన్న వ్యక్తి నేటి ఎన్నికల వ్యవస్థలో పోటీ చేసి.. డబ్బు ఖర్చు చేయకుండా గెలిచే అవకాశం ఉందా..?


ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు వెదకాలి.. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. అవి రాజ్యాంగంలో భద్రంగా ఉన్నాయి.. కానీ వాస్తవం ఎలా ఉంది..? మరి మారాల్సింది ఎవరు.. అంతిమంగా జనమే కదా. మార్పు జనంలో వస్తే.. ఆ తర్వాత పార్టీల్లో వస్తుంది.. ఏదేమైనా ఈ రాజుగారు లేవనెత్తిన అంశం మాత్రం ఆలోచించాల్సిందే సుమా..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: