కోహ్లీ vs బీసీసీఐ : వివాదం మొద‌ల‌యిందా..?

Paloji Vinay
ఇండియా క్రికెట్ టీమ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎదురేని సార‌థిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆట‌గాడిగా త‌న ప్ర‌తిభ గొప్ప‌ది. ఫార్మ‌ట్ల‌కు అతీతంగా వ‌రుస‌గా సిరీస్‌లు గెలుస్తూ క్రికెట్ టీమ్ ఇండియాను బలమైన జ‌ట్టుగా తీర్చిదిద్దాడు. ఫ‌లితంగా త‌న‌కు ఎవ‌రూ సాటి రాని విధంగా ఎదిగిపోయాడు. కానీ, ప‌రిస్థితులు మారిపోయాయి. కెప్టెన్‌గా ఎంత‌మంచి బాధ్య‌త‌లు నిర్వ‌హించినా, ఎన్ని రికార్డులు సృష్టించినా ఒక్క ఐసీసీ ట్రోఫిని తీసుకురాలేదన్న అప‌వాద‌ను మోయాల్సి వ‌స్తోంది. విరాట్ కొహ్లీ సార‌థ్యంలో టీమ్ ఇండియా అన్ని ఫార్మాట్ల‌లో రాణించింది. త‌ర్వాత గౌర‌వ‌ప్ర‌దంగా టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. త‌రువాత బీసీసీఐ వ‌న్డెల సార‌థ్యం నుంచి త‌ప్పించ‌డం వివాదంగా మారింది.


  ఈ విష‌యంపై కొహ్లీ, బీసీసీఐ మీడియాతో పంచుకున్న అంశాలు ప‌ర‌స్ప‌రం భిన్నంగా ఉన్నాయి. ఈ అంశం కొత్త సందేహాల‌కు దారితీస్తోంది. దీంతో కొహ్లీ బీసీసీఐ మ‌ధ్య విభేదాలు మొద‌ల‌యిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 2019 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ సెమీస్‌లో న్యూజీలాండ్ చేతిలో భార‌త్ ఓట‌మి పాల‌య్యాక కొహ్లీ-రోహిత్ శ‌ర్మ‌ల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, వీటిపై మౌనం పాటించిన  విరాట్ చివ‌ర‌కు త‌మ మ‌ధ్య అలాంటివేమీ లేవ‌ని చెప్పుకొచ్చాడు. దాంతో ఆ వివాదానికి తెర‌ప‌డింది. అయితే, ద‌క్షిణాఫ్రికాతో సిరిస్‌కు జ‌ట్టును ఎంపిక చేసిన‌ప్పుడే కొహ్లీకి బీసీసీఐ షాక్ ఇచ్చింది.


  వ‌న్డేల‌కు కెప్టేన్‌గా రోహిత్ శ‌ర్మ‌ను ప్ర‌క‌టించింది. కోహ్లీని వ‌న్డే సార‌థ్యం నుంచి వివాదం చెల‌రేగ‌డంతో బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని కొహ్లీకి ముందే వివ‌రించిన‌ట్టు తెలిపారు. టీ20 కెప్టెన్సీ వైదొలిగిన త‌రువాత త‌న‌తో ఎవ‌రు మాట్లాడ‌లేద‌న్నారు. ద‌క్షిణాఫ్రికా టీమ్‌ను ప్ర‌క‌టించే స‌మ‌యంలో కాల్ ముగిసే ముందు త‌న‌ను వ‌న్డే కెప్టెన్‌గా త‌ప్పిస్తున్న‌ట్టు చెప్పార‌ని కొహ్లీ తెలిపాడు. దీంతో కొహ్లీ - బీసీసీఐ మ‌ధ్య వివాదాలు త‌లెత్తాయ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఈ నిర్ణ‌యం త‌రువాత కొన్ని రోజులు మౌనంగా ఉన్న కొహ్లీ ఇప్పుడు బోర్డును, సెలెక్ష‌న్ క‌మిటీ త‌ప్పుబట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: