రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆప్స్ చేరేనా ?

VAMSI
ఐపిఎల్ సీజన్ 14 లెగ్ 2 లో భాగంగా నిన్న పంజాబ్ మరియు రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక దశలో ఏకపక్షంగా సాగుతోంది అనుకున్న తరుణంలో పంజాబ్ బౌలర్స్ అధ్బుతంగా పుంజుకుని చివరి ఓవర్లలో రాజస్థాన్ ఆటగాళ్లకు అడ్డు కట్ట వేశారు. తద్వారా రాజస్థాన్ 200 పై చిలుకు పరుగులు చేయాల్సింది పోయి 185 పరుగులకు చాపచుట్టేసింది. చేధనలో పంజాబ్ ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ మొదట ఆచి తూచి ఆడారు. ఇన్నింగ్స్ 4 ఓవర్ నుండి ఊపందుకున్న వీరిద్దరూ ఒక్కసారిగా రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు. ఇక పంజాబ్ గెలుపు లాంఛనమే అని రాజస్థాన్ అభిమానులు టీవీ కట్టేసి ఉంటారు. కానీ మ్యాచ్ చివరి ఓవర్ కు నాలుగు పరుగులు చేస్తే విజయం పంజాబ్ ను వరిస్తుంది. అప్పటికి కూడా పంజాబ్ గెలుపు పక్కా అనుకున్నారు.
కానీ ఇదే సమయంలో అద్బుతం జరిగింది.  యువ పేసర్ కార్తిక్ త్యాగి అద్భుతమైన బౌలింగ్ తో కేవలం 1 రన్  ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ కు రెండు పరుగుల విజయాన్ని అందించాడు.  ఇలా నిన్న జరిగిన మ్యాచ్ చూసిన ఏ పంజాబ్ అభిమానికైనా ఒక్క విషయం అనిపించి ఉంటుంది. ఈ సీజన్ లో ఇక పంజాబ్ ప్లే ఆప్స్ చేరడం కష్టం. ఇలా జరగడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా కొన్ని సార్లు ఆఖరి వరకు వచ్చి చతికిలపడింది. ఈ ఓటమితో రాహుల్ సేన తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఒక్క ఓవర్ లో అంతా కలలా జరిగిపోయింది. రాజస్థాన్ ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో సెటిల్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే రాజస్థాన్ కి ఈ విజయం చాలా బూస్ట్ అప్ ఇచ్చింది అని చెప్పాలి.  
సెకండ్ లెగ్ మ్యాచ్ లకు డుమ్మా కొట్టినఇంగ్లాండ్ ఆటగాళ్ళు బట్లర్, జోప్రా అర్చర్ ల లాంటి మేటి ఆటగాళ్ళు లేకపోయినా గెలిచి ప్లే ఆఫ్ చేరుకోవడానికి అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంది. ఇక మిగిలిన 6 మ్యాచ్ లలో కనీసం 5 గెలిస్తే ప్లే ఆప్స్ కు చేరుకోవడానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. అలా కాకుండా మొత్తం మ్యాచ్ లు గెలిస్తే డైరెక్ట్ గా ప్లే ఆప్స్ కు వెళుతుంది. మరి చూద్దాం రాజస్థాన్ నాక్ ఔట్ స్టేజ్ కు చేరుకుంటుందా లేదా? ప్రస్తుతానికి జట్టు కూర్పు బాగుంది. బౌలింగ్ లో ఇంకొంచెం మెరుగుపడాలి. బ్యాటింగ్ విభాగం మాత్రం లూయిస్ మరియు జైస్వాల్ ఫామ్ అందుకోవడం శుభ పరిణామం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: