సమతామూర్తి దర్శనం టికెట్‌ రేట్లు ఫిక్స్.. ఎంతంటే..?

సమతామూర్తి విగ్రహం.. తెలంగాణ ఆధ్యాత్మిక, పర్యాటక రంగంలో ఓ కొత్త అధ్యాయంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ శివార్లలో కొలువుదీరిన సమతా మూర్తి విగ్రహం ఇప్పుడు ప్రముఖ చర్చనీయాంశం అయ్యింది. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతలలో ఈ సమతామూర్తి విగ్రహం ఏర్పాటైన సంగతి తెలిసిందే.  216 అడుగుల విగ్రహం ఇండియాలోనే రెండో అతి పెద్దదిగా చెబుతున్నారు.

ఇటీవలే ఈ విగ్రహాన్ని ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా అనేక మంది ప్రముఖులు దర్శించుకున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ ఈ సహస్రాబ్ది సమారోహం జరిగింది. ఇప్పుడు ఈ సమతా మూర్తి విగ్రహాన్ని సామాన్యులు కూడా దర్శించుకునే వెసులు బాటు కల్పించారు. ఈ  సమాతామూర్తి స్ఫూర్తి కేంద్రం దర్శన రుసుములు ఖరారయ్యాయి. దర్శనం టికెట్లు పెద్దలకు రూ.150గా నిర్ణయించారు.  6-12 ఏళ్లలోపు పిల్లలకు రూ.75 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా సమాతామూర్తి కేంద్రం దర్శనానికి అనుమతిస్తారు.

ఈనెల 19 తర్వాత ఉదయం, సాయంత్రం వేళల్లోనూ భక్తులకు దర్శనం అవకాశం ఉంటుంది. ఈ సమతా మూర్తి విగ్రహం స్వర్ణ కాంతుల్లో ధగధగలాడుతోంది. ఈ విగ్రహం విడివిడి భాగాలుగా చైనాలో తయారు చేసి అక్కడి నుంచి ఇండియా తీసుకొచ్చి కూర్చారు. హైదరాబాద్, కర్ణాటకల్లో ఈ విగ్రహం సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ రూపొందించి దాన్ని చైనాలోని ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు పంపి అక్కడ ఈ  విగ్రహం తయారు చేయించారు.

ఈ సమతా కేంద్రంలో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వైష్ణవులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 108 ఆలయాల నమూనాలను ఈ సమతా కేంద్రంలో నిర్మించారు. అంటే.. ఇక్కడకు వస్తే ఒకేసారి 108 ఆలయాలను దర్శించుకోవచ్చన్నమాట. అంతే కాదు.. రామానుజులు 120 ఏళ్లు బతికారనేదానికి గుర్తుగా 120 కేజీల బంగారు విగ్రహం కూడా ఉంది. అయితే.. ప్రస్తుతం దాన్ని సందర్శకులకు అనుమతించడం లేదు. అలాగే ఇక్కడ 216 విగ్రహంపై లేజర్‌ షో ఆకట్టుకుంటుంది. మరి ఇంకేం.. ఓసారి ప్లాన్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: