పెన్ష‌న్ల తొల‌గింపుపై జ‌గ‌న్ అన‌వ‌స‌ర రాద్దాంతం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

RAMAKRISHNA S.S.
- మృతి చెందిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పెన్షన్ లే తొలగించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- 2024-25, 2025-26 ఆర్ధిక సంవత్సరంలో బేవరేజెస్ కార్పొరేషన్ రూ. 11 వేల 140.46 కోట్ల ఖర్చు చేసిందన్న మంత్రి
- వైసీపీ ప్రభుత్వంలో 11 లక్షల పెన్షన్లను అన్యాయంగా తొలగించారు

- ( ఇండియా హెరాల్డ్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి - అమ‌రావ‌తి ) :

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం మృతిచెందిన, శాశ్వ‌తంగా వ‌ల‌స‌వెళ్లిన 4,45,802 పెన్ష‌న్లు మాత్ర‌మే ర‌ద్ద‌య్యాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. గ‌త వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌తి ఆరు నెల‌ల‌కు సిక్స్ స్టెప్ వ్యాలీడేష‌న్ పేరుతో 5 ఏళ్ల‌లో ఏకంగా 11 ల‌క్ష‌ల‌కు పైగా పెన్ష‌న్లు ర‌ద్దు చేసి పేద‌ల పొట్ట‌గొట్టారని కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాల‌న కాలంలో ఇష్టం వ‌చ్చిన‌ట్టు పెన్ష‌న్లు తొల‌గించారని, ఆ విధంగా కూట‌మి ప్రభుత్వ, 20 నెల‌ల పాల‌న‌లో అన్యాయంగా ఒక్క పెన్ష‌న్ కూడా తొల‌గించ‌లేదని, పేదలకు అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి, ప్రతీ నెలా స్పౌస్‌ పెన్షన్ కోటాలో వితంతువులకు పెన్షన్ మంజూరు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.


నెల నెలా  స్పౌస్‌ పెన్షన్ లను మంజూరు చేస్తుంటే, ఏ ఒక్క పెన్షన్ మంజూరు చేయలేదని ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఊహాలోకంలో బ్రతుకుతూ, వారి సొంత టీవీ ఛానెల్స్ లో, పెయిడ్ మీడియాలో ఆరు లక్షల పెన్షన్ లు తొలగించారు, ఇంకో 7 లక్షల 46 వేల పెన్షన్ లు తొలగిస్తారు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం ACT No 31 of 2021  ప్రకారం బెవరేజెస్ కార్పొరేషన్ నిధుల ద్వారా  వివిధ సంక్షేమ  కార్యక్రమాలు చేపట్టేందుకు చట్టం చేశారని, గత ప్రభుత్వం 2021-24 మధ్య కాలంలో బేవరేజెస్ కార్పొరేషన్ నుండి ₹18,472.59 కోట్లు ఖర్చు చేసిందని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు  రూ. 11 వేల 140.46 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు.


బేవరేజెస్ కార్పొరేషన్ వారు ఇచ్చే నిధుల వివరాలు ప్రభుత్వ బడ్జెట్ లో చూపించడం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అదే విధంగా సామాజిక భద్రతా పెన్షన్ ల కోసం గానూ, 2026-27 ఆర్ధిక సంవత్సరంలో 27 వేల 719 కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగిందని, పెన్షన్ లకు కావాల్సిన మరో రూ.5 వేల 766 కోట్ల రూపాయలను పైన పేర్కొన్న యాక్ట్ ప్రకారం(act no 31 అఫ్ 2021) బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయబడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. పెన్షన్ లకు ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులు రాకుండా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఏ విధమైన రాజకీయ ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని ప్రజలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: