పదండహో.. మొదలైంది మేడారం మహా జాతర..!

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క- సారలమ్మ మహా జాతర మొదలైంది. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఈ  మేడారంలో మహా జాతర జరుగుతుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 19 వరకు.. అంటే నాలుగు  రోజుల పాటు ఈ మహా జాతర జరగుతుంది. ఇవాళ సాయంత్రం కన్నెపల్లి నుంచి గద్దెలపైకి సారలమ్మ రాకతో భక్తుల సంబరాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత గంగారాం మండంలం పూనుగొండ్ల నుంచి గద్దెలపైకి పగిడిద్ద రాజు రాకతో సందడి మరింత ఊపందుకుంటుంది. ఏటూరు నాగారం మండలం కన్నాయిగూడెం నుంచి గద్దెలపైకి  గోవిందరాజులు వస్తాడు.

ఇక మరో వన దేవత సమ్మక్క.. రేపు గద్దెలపైకి చేరుకుంటుంది. ఈ మేడారం మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసింది. ఎల్లుండి సమ్మక్క-సారలమ్మను తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకుంటారు. ఈ జాతరలో పారిశుద్ధ్య నిర్వహణకు 2,500 కార్మికుల సేవలు వినియోగిస్తున్నారు. 650 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. మేడారం జాతరలో 6 వేల తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

అలాగే ఈ మేడారం జాతర కోసం టీటీడీ కల్యాణమండపంలో 50 పడకల తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేశారు. మేడారం పాఠశాలలో 10 పడకలతో తాత్కాలిక ఆస్పత్రి కూడా ఏర్పాటు చేశారు. అలాగే మేడారం జాతర పరిసరాల్లో 35 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మొత్తం జాతర విధుల్లో వివిధ శాఖల నుంచి 30 వేల మంది  అధికారులు, సిబ్బంది ఈ మహా యజ్ఞానికి సహకరిస్తున్నారు.
మేడారం జాతరకు 10,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ జాతర బందోబస్తు కోసం 382 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మేడారం జాతర పరిసరాల్లో  33 పార్కింగ్ పాయింట్లు, 37 హాల్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మేడారం జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ 3,845 బస్సులను నడుపుతోంది. జంపన్నవాగులో స్నానాలు చేస్తారు కాబట్టి ముందు జాగ్రత్తగా ఇరువైపులా 200 మంది గజఈతగాళ్లతో పహారా ఏర్పాటు చేశారు. ఈ మహా జాతర ఈనెల 19న సమ్మక్క-సారలమ్మ దేవతల వనప్రవేశంతో ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: