ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండగల్లో రంజాన్ కు చాలా ప్రత్యేకత ఉంది. ఇస్లాం ను అనుసరించేవారు త్రికరణ శుద్దితో వినయ విధేయలతో అల్లాహ్ లోబడి జీవిస్తారు. ఎవరి అదుపు ఆజ్ఞలో సకల చరాచర లోకవ్యవస్థ పురోగమిస్తుందో అతంటి శక్తివంతమైన అల్లాహ్‌కి లోబడి పవిత్ర ఖురాన్ నిర్దేశించిన జీవన విధానాన్ని గడపడం ఇస్లాం మతస్థుల విధి. ఇక ముస్లింలు చంద్రామాన క్యాలెండర్ ను అనుసరిస్తారు. ఈ క్యాలెండర్‌లో 9వ నెల రంజాన్ మాసం ఆరంభం అవుతుంది. ఈ మాసంలో ముస్లింలు కఠిన నియమాలు పాటించి ఉపవాస దీక్షను చేపడతారు. ఆకలిదప్పులకు, శరీర వాంఛలకు, దూరంగా ఉంటూ అల్లాహ్ ను ఎంతో భక్తితో సేవేస్తారు.
ముస్లింలకు ముఖ్యమైన ఐదు విధులైన ఈమాన్, నమాజ్, జకాత్, రోజా, హజ్‌లలో రోజాను రంజాన్ మాసంలో త్రికరణ శుద్ధితో ఆచరిస్తారు. ఉపవాసాన్ని అరబ్బీలో ‘సౌమ్’ అని, ఉర్దూ భాషలో ‘రోజా’ అనీ పిలుస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన 'రోజా' ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహ్మద్ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పవిత్ర మాసంలో దానధర్మలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఖురాన్ సిద్దాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం నూటికి రెండు రూపాయలు అయినా దానధర్మం చేయాలని ముస్లింలు భావిస్తారు.
తమకు ఉన్న వాటిలో ధనం, ధాన్యం, బట్టలు, బంగారం మొదలినవి దానం చేయాలని ఖురాన్ చెబుతోంది. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేద వారు కూడా పండుగ పూట భగవంతుడిని తలచుకొని సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతుంటారు. ఈ దానధర్మ గుణం ,భక్తి భావాన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్రమైన రంజాన్ నెలతో ప్రారంబిస్తారు. ఆకలి అంటే ఎంత కఠీనంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ 'రోజా' ఉపవాసదీక్షలు అనే సూత్రాన్ని పాటిస్తారు. లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను గడుపుతున్న వారి కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటివారికి దాన ధర్నాలు చేయాలని ముస్లింలు చెబుతూ ఉంటారు. ఇలా చేస్తే అల్లాహ్ అనుగ్రహం తప్పక పొందుతారని ముస్లింలు విశ్వసిస్తారు.