నేడే కృష్ణాష్టమి... కృష్ణుడిని ఎలా ఆరాధించాలంటే...?
ఆయుధం పట్టకుండానే కురుక్షేత్రాన్ని నడిపించిన యోధుడు చిన్ని కృష్ణుడు. ఈరోజు శ్రీ కృష్ణుడి పర్వదినం. పురాణాల ప్రకారం నేటితో శ్రీ కృష్ణుడు జన్మించి 5,246 సంవత్సరాలైంది. ఈరోజు కృషుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి రోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో చిన్ని కృష్ణుడిని ఆరాధించాలి. వేకుమజామున నిద్ర లేచి తల స్నానం చేసిన తరువాత పసుపు రంగు బట్టలు ధరించాలి.
గుమ్మాలకు తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమ రాయాలి. అనంతరం కృష్ణుడి పాదాలను ముద్రించుకోవాలి. స్వామివారికి శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ నైవేద్యంగా పెట్టాలి. ఊయల కట్టి అందులో కృష్ణుని విగ్రహాన్ని పెట్టి కీర్తనలు పాడాలి. ఈరోజు వీధుల్లో ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే కృష్ణాష్టమిని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని కూడా పిలుస్తారు.
బ్రహ్మాండ పురాణం ప్రకారం భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతాయి. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడిని నేటికీ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. కృష్ణుడిని 3 రకాలుగా ఆరాధిస్తారు. మొదటి ఆరాధనలో సూర్యోదయానికి ముందు కృష్ణుడికి పూజ చేసి ఉపవాసం ఉండి ఆరాధిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పూజతో రెండో ఆరాధనను ప్రారంభిస్తారు. మొదట నీరు తీసుకుని దేవకికి అర్పించి అనంతరం మాధవుడికి పూజ చేయాలి. మూడవ ఆరాధన అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది. భక్తులు తమ కోరికలను నియంత్రించుకుని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు.