శివం : శివుడిని లింగ రూపంలోనే ఎందుకు కొలుస్తారో తెలుసా...?
హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ప్రథముడు. శివుడిని ఆయన భక్తులు పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. త్రిమూర్తులలో చివరివాడైన శివుడు సింధూ నాగరికత కాలం నుంచే పూజలు అందుకున్నాడు. శివ అనగా కల్మషము లేని వాడు అని అర్థం. జననమరణాలకు అతీతుడైన శివుడిని దేవతలు కూడా పూజిస్తారు. శివుని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి.
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే సామెత మనం తరచూ వింటూ ఉంటాం. అభిషేక ప్రియుడు అయిన శివుడిని భక్తులు కోరికలు తీర్చే కొంగుబంగారమని విశ్వసిస్తారు. భారతదేశంలోని దేవాలయాలలో శివుని ఆలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయంటే శివుని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. శివ లింగము హిందూ మతంలో భక్తులు పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. లింగంను దైవ సంభావ్యతగా, శక్తి సూచికగా పరిగణిస్తారు.
అయితే వరాహపురాణంలో శివుడిని లింగ రూపంలో పూజించటానికి పూజించడానికి గల చరిత్రను పేర్కొన్నారు. వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన ఈ గాథలో భృగు మహర్షి శివుడి దగ్గరకు వస్తాడు. శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోకవడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురై శివుడిని శపిస్తాడు. "నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపించడం వల్ల శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మొదలైంది.
అంతకుముందు శివుడు విగ్రహ రూపంలోనే పూజలు అందుకునేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ శాపం వల్ల శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించే సంప్రదాయం మొదలైంది. శివ లింగములో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా ఉంటుంది. శివ లింగాన్ని శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధంగా సరైన సరైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.