ఉపనయనానికి సరియైన కాలము (వయస్సు)

Prasad Bura

       "గర్భాష్టమేబ్దే కుర్వీత బ్రహ్మణస్యోపనాయనమ్

          గర్భాదేకాదశే రాజ్ఞః గర్భాత్తు ద్వాదశే విశః" అనే మనుస్మృతి (2-36) - వచనానుసారం బ్రహ్మణ బాలురకు 7వ సంవత్సరం (తల్లి గర్భంలో పడినప్పటి నుండి ఎనిమిదవ సంవత్సరంలోగా), క్షత్రియులకు 11వ సంవ||, వైశ్యులకు 12వసంవత్సరంలోగా ఉపనయన సంస్కారం జరుపుటకు సరియైన కాలం.

          "వసంతో గ్రీష్మ శరదిత్యృతవో వర్ణానుపూర్వేణ" - ఆపస్తంబ సూత్ర ప్రకారం బ్రాహ్మణ బాలునికి వసంత ఋతువునందు, క్షత్రియ కుమారునికి ఆషాఢం కాకుండా గ్రీష్మఋతువులో, వైశ్య పుత్రునికి శరదృతువు నందు ఉపనయనం చేయాలి.

          బ్రహ్మవర్చస్సు కోరువారు 5వ సం||లో పనయనం చేసి గురుకులంలో ప్రవేశ పెట్టటం కూడా ఆచారంగా వస్తున్నది. ఏవైనా అంతరాయములు ఏర్పడికాని, కారణాంతరముల వలన గాని సకాలంలో ఉపనయనం చేయటం, సాధ్యపడని పక్షమున బ్రహ్మణులకు 16వ సం|| పూర్తి కాకుండా క్షత్రియులకు 22సం||ల లోప, వైశ్యులకు 24 సం||లలోపు ఈ ఉపనయన సంస్కారం జరిపించాలని మనుస్మృతివచనం. (2-38)గాయత్ర్యాది ఛందస్సులు మన శరీరాన్ని ఆవహించి ఉన్నవి 16/22/24 సంవత్సరముల వరకు ఎదురు చూచి ఉపనయన సంస్కారం పొందనందున నిరాశోపహతులై అంతర్హితము లౌతాయి. ప్రస్తుత కాలంలో చదువులకు, ఉద్యోగాలకు కనీస, గరిష్ఠ వయో పరిమితులు ఉన్నాయి కదా! వీటిని అతిక్రమించిన వారు ఎట్లా వాటికి అనర్హులుగా పరిగణింపబడుతారో అట్లే వయోపరిమితిని మించి చేసిన సంస్కారాలు కూడా వ్యర్ధములే అవుతాయి కదా! కంచం ఖాళీ చేసే వయసు వచ్చాక అన్న ప్రాశన చేయడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆలోచించండి.

          ప్రస్తుతం క్షత్రియ, వైశ్య కుటుంబాలలో ఎక్కడో ఒకరిద్దరు తప్ప దీన్ని సకాలంలో ఆచరిస్తున్నవారు మృగ్యం (వెతకాల్సిందే). ఇక బ్రాహ్మణ కుటుంబాలలో కూడా చాలా మంది ఈ ఉపనయనాన్ని వివాహానికి ఒకటి రెండు రోజుల ముందుగానో లేక అదే రోజు పూర్వాంగంగానో మొక్కుబడిగా అయిందనిపిస్తున్నారు. ఎంతో పవిత్ర బంధమైన వివాహ సంస్కారమే లక్షలు వెచ్చించే ఆర్భాటమైన వేడుకగా జరుపుతుంటే, ఉపనయనాన్ని పట్టించుకునేదెక్కడ? ఇది కూడా ఆ వేడుకలో అంతర్భాగమైపోయంది.

          భూమిలో విత్తనాన్ని సరియైన కాలంలో నాటితే అది ఫలితానికి వస్తుంది. అనుకూలంగాని మండు వేసవి కాలంలో నాటితే దానికి తగ్గ ఫలితం అనుభవిస్తాము కదా! ముసలి వాడైనాక వివాహానికి పూనుకుంటే ఏమౌతుంది? ఏదైనా అంతే సకాలంలో చేసే పని సరియైన ఫలితాన్ని ఇస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: