కేసీఆర్ ఫామ్‌ హౌజ్‌లో తాంత్రిక పూజలా..?

Chakravarthi Kalyan
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ షాకింగ్ విషయంపై విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్  ఫామ్ హౌజ్‌లో తాంత్రిక పూజలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బండి సంజయ్‌ ఈ అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజలు ఎందుకు చేస్తున్నావు కేసీఆర్ అని ప్రశ్నించిన బండి సంజయ్.. బీజేపీ నేతలు నాశనం కావడానికి తాంత్రిక పూజలు చేస్తున్నావా లేదా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ప్రతి పక్షాల నాశనం కోరుతూ తాంత్రిక పూజలు చేస్తున్నావంటే.. నీ పతనం ప్రారంభమైందని అర్థం చేసుకో అంటున్నారు బండి సంజయ్. ఒక్కసారి అబద్ధాలు చెప్పితే ప్రజలు నమ్ముతారని.. పదే పదే చెబితే అసహ్యించుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కు కాషాయ సెగ తగిలి బీజేపీని కేసీఆర్  ఇష్టం వచ్చినట్లు తిట్టారని.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ గెలవబోతుందని తెలవడంతో ప్రజల దృష్టి మరల్చాలని కేసీరఆర్ చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కాషాయ జెండాను తీసుకెళ్లి బంగాళాఖాతంలో కల్పుతానని అడ్డు, అదుపు లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని.. ఎగ్జిట్ పోల్స్ చూసి కేసీఆర్ కు మతి భ్రమించిందని బండి సంజయ్ విమర్శించారు.

తెలంగాణలో భాజపా ఉన్నంతకాలం పచ్చ జెండాలకు అవకాశం ఇవ్వబోమన్న బండి సంజయ్.. రజాకార్లను సంకలేసుకుని తిరుగుతూ బీజేపీ మతతత్వ పార్టీ అంటావా కేసీఆర్ అని ప్రశ్నించారు. నీతో హిందువునని చెప్పించిన పార్టీ బీజేపీ.. గుర్తు చేసుకో కేసీఆర్... మజ్లీస్ పార్టీ సెక్యులర్ పార్టీనా కేసీఆర్.. హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే.. మూసీ నదిలో కలుపుతా కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. బీజేపీ మిలియన్ మార్చ్ కి సిద్ధం అవ్వడంతో.. కేసీఆర్ మరోసారి నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తున్నారని.. బిస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేయవద్దని.. 25లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. విద్యా వాలంటరీలను, ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: