శ్రీలంకలో మండుతున్న రేట్లు.. మోడీ ఫుల్ హ్యాపీస్..!?

Chakravarthi Kalyan
దేశంలో పెరుగుతున్న పెట్రోల్, సిలిండర్ రేట్లపై ఇప్పటికే దేశవ్యాప్తంగా జనంలో ఆందోళన మొదలైంది. పెట్రోల్ రేట్లు సెంచరీ దాటి దూసుకుపోతున్నాయి. దీనిపై విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ ధర వెయ్యికి చేరువవుతోంది. ఈ అంశాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో మోడీ సర్కారుపై దాడి తీవ్రమైంది. ఇదేనా అభివృద్ధి అంటూ విమర్శలు పెరిగాయి. అయితే.. ఈ పరిస్థితి మోడీ అభిమానులకు కూడా ఇబ్బందికరంగానే మారింది.

మోడీ సర్కారును సమర్థించలేక.. అటు విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బందిపడుతున్న మోడీ ఫ్యాన్స్‌కు ఇప్పుడు శ్రీలంక పరిస్థితి పరమానందం కలిగిస్తోంది. అవును మరి.. శ్రీలంకలో ఆహార, ఆర్థిక సంక్షోభం రోజురోజుకు పెరిగి రేట్లు దారుణంగా పెరుగుతున్నాయి. అక్కడ రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. విదేశీ అప్పులు శ్రీలంకను  ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కారణాలతో నిత్యావసరాలపై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేసింది. అంతే.. అక్కడ గ్యాస్‌ ధర ఒక్కసారిగా 1,257 రూపాయలు పెరిగి 2 వేల 657కి చేరింది.

శ్రీలంకలో 250 రూపాయలు ఉన్న లీటర్ పాలధర 1,195 రూపాయలకు చేరుకుంది. ఇక  గోధుమ పిండి, పంచదార, పప్పులు సహా ఇతర నిత్యావసర సరకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.  పెరిగిన ధరలపై అక్కడ ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. శ్రీలంకలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2019 నవంబర్‌లో 7.5 బిలియన్ డాలర్లు ఉండేవి.. అవి ఇప్పుడు  2.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు శ్రీలంక సర్కారు దిగుమతులపై నిషేధం విధించింది. పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందుకే అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇప్పుడు మోడీ భక్తులు శ్రీలంక రేట్లను చూపించి ఇండియా చాలా బెటర్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: