కరోనా ఫెయిల్యూర్ : వాళ్లలాగే మోడీ కూడా సారీ చెప్తారా..?

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారిని అంచనా వేయడంలో ప్రపంచంలోని అనేక దేశాలు విఫలమయ్యాయి. ఫస్ట్ వేవ్‌ విషయాన్ని ప్రపంచం మొత్తం అంచనా వేయలేకపోయింది. దానికి ఎవరినీ బాధ్యులను చేయలేం.. ఎందుకంటే అప్పటికి కరోనా గురించి ఎవరికీ పెద్దగా సమాచారం లేదు. కరోనా ఏంటి..ఎలా వస్తుంది..ఎలా అరికట్టాలి అనే విషయాలు తెలిసేసరికే ఆ మహమ్మారి  ప్రపంచాన్ని చుట్టేసింది.. కానీ.. సెకండ్ వేవ్ సంగతి అలా కాదు.. కరోనా ఫస్ట్ వేవ్‌లో చావు దెబ్బ తిన్న దేశాలు కూడా సెకండ్ వేవ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు.

అలా నిర్లక్ష్యం వహించిన దేశాలు దాని ఫలితం అనుభవించాయి. ఆ దేశాల జాబితాలో ఇండియా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు సదరు దేశాధినేతలు తమ తప్పు గ్రహించారు. కరోనా కట్టడిలో విఫలమైనందుకు, టీకా పంపిణీలో లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనందుకు ఇప్పుడు వారు తమ తప్పు గ్రహించారు. తమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నారు. సెకండ్‌ వేవ్‌ కట్టడిలో విఫలమైన ఆస్ట్రేలియా... మళ్లీ మాత్రం వైరస్‌ ఉద్ధృతితో సతమతమవుతోంది.

సిడ్నీతో పాటు అనేక నగరాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. చివరకు మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆశించినంత వేగంగా లేదు. ఇప్పటివరకూ కేవలం 12శాతం మందే రెండు డోసులు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు పెరిగాయి. దీంతో ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ స్పందిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. టీకా పంపిణీలో పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని..  ఇందుకు పూర్తి బాధ్యత నాదేనని అంటూ ఆయన క్షమాపణలు చెప్పారు.

మరోవైపు బ్రిటన్ ప్రధాని కూడా తనపై విమర్శలకు బదులిస్తూ పార్లమెంట్ సాక్షిగా సారీ చెప్పారు. కరోనాతో ప్రజలకు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బాధలకు నేను క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఇలాగే నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రూట్‌, దక్షిణకొరియా ప్రధాని కిమ్‌ బూ కుమ్‌కు కూడా ప్రజలను క్షమాపణ కోరారు. కానీ.. మనదేశంలో సెకండ్ వేవ్ ఎదుర్కోవడంలో విఫలమైన మోడీ సర్కారు మాత్రం ఇంకా క్షమాపణలు చెప్పలేదు. అసలు అలాంటి పశ్చాత్తాపమే కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: