హెరాల్డ్ సెటైర్ : కోర్టు దెబ్బకు ఎలక్షన్ కమీషన్ కు దిమ్మ తిరిగినట్లుంది

Vijaya
కేంద్ర ఎన్నికల కమీషన్ వ్యవహారం మరీ విచిత్రంగా తయారైంది. ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిపోయిందన్నట్లుగా తయారైంది ఎన్నికల కమీషన్ వ్యవహారం. ఐదురాష్ట్రాల ఎన్నికల నిర్వహణలో లోపాల వల్లే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత పెరిగిపోయిందని చెన్నై హైకోర్టు కమీషన్ను దుమ్ము దులిపేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణలో నిబంధనలను అనుసరించని కేంద్ర ఎన్నికల కమీషన్ పై మర్డర్ కేసు బుక్ చేయాలని తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తంచేసింది. సరే ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమీషన్ సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది. ఆ కేసు విచారణలో ఉండటం వేరే విషయం.



ఇక ప్రస్తుతానికి వస్తే ఏపి, తెలంగాణలో తొమ్మిది ఎంఎల్సీ స్ధానాల కోసం ఎన్నికలు జరగాల్సుంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కారణంగా తొమ్మిది స్ధానాల్లో ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించటమే కాస్త ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణాలో ఆరుగురి పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగియబోతోంది. అలాగే ఏపిలో మరో 3 స్ధానాలు మే 31వ తేదీకి ఖాళీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన స్ధానాలే. ఈ స్ధానాల్లో కొత్తగా ఎవరిని ఎంపిక చేయాలనేది ఆయా ముఖ్యమంత్రుల అభీష్టం మీదే ఆధారపడుంటుంది. కాబట్టి ముఖ్యమంత్రులు ఎంపిక చేసే తొమ్మిదిమందికి ఎంఎల్ఏలు ఓట్లేస్తారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోటీపెట్టి అధికారపార్టీని సవాలు చేసేంత సీన్ రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల్లో దేనికీ లేదు. కాబట్టి అధికారపక్షం తరపున ఎంపికైన వారు దాదాపు ఎంఎల్సీలు అయినట్లే లెక్క.  అంటే ఎంఎల్ఏ కోటాలో జరగబోయే ఎన్నికలకు  ప్రచారం లాంటి సమస్యలేమీ ఉండవు. కాకపోతే ఓటింగ్ రోజున ఎంఎల్ఏలు ఓట్లేయటానికి పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాల్సుంటుంది. అలాగే బ్యాలెట్లు కూడా రెడీచేయాలి. పోలింగ్ రోజున పోలింగ్ సిబ్బంది అవసరమవుతారు. మొత్తం ఓట్లు కూడా తెలంగాణాలో 119, ఏపిలో 175 అంతే. కాబట్టి ఎన్నికల ప్రక్రియకు పెద్దగా కష్టపడేది కూడా ఏమీ  ఉండదు. ఓట్లేసేందుకు వచ్చే ఎంఎల్ఏల విషయంలో పోలింగప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంటే ఈ ఎన్నికలను నిర్వహించినా కరోనా వైరస్ విజృంభిచేస్తుందనేందుకు అవకాశం కూడా లేదు. అయినా కేంద్ర ఎన్నికల కమీషన్ ఎంఎల్సీ ఎన్నికలను వాయిదా వేసింది. ఇక్కడే కోర్టులంటే కేంద్ర ఎన్నికల కమీషన్ ఎంతలా భయపడుతోందో అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: