హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు అండ్ కో ఎక్కడా అడ్రస్ లేరే ?

Vijaya
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక రిజల్టు దెబ్బకు కమలనాదుల నోళ్ళు పడిపోయింది. ఉపఎన్నికకు నోటిఫికేషన్ కూడా విడుదల కాకముందే తిరుపతిలో బీజేపీ చీఫ్ సోమువీర్రాజు నానాగోల మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే వీర్రాజు రచ్చ మొదలుపెట్టారో వెంటనే మిగిలిన నేతలు కూడా అదే ఫాలో అయిపోయారు. ఇదే సందని తెలంగాణా బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా బైబిల్ పార్టీ కావాలా ? భగవద్గీత పార్టీ కావాలా ? అంటు జనాలను రెచ్చగొట్టారు. సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు లాంటి నేతలైతే నోటికి అదుపులేకుండా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తు నానా మాటలన్నారు. పోలింగ్ జరగటమే ఆలస్యం బీజేపీ అభ్యర్ధి గెలిచిపోయినట్లే అన్నంతగా ఊదరగొట్టారు.



సీన్ కట్ చేస్తే నామినేషన్లు వేయటానికి రెండు రోజుల ముందుకానీ అభ్యర్ధిగా రత్నప్రభను ఫైనల్ చేయలేకపోయారు. అసలు పార్టీలోని నేతలకే రత్నప్రభ అంటే ఎవరో తెలీదు. పార్టీ నేతలకే తెలీని అభ్యర్ధికి ఇక జనాలు ఎందుకు ఓట్లేస్తారు ? కౌంటింగ్ తర్వాత బయటపడిన విషయం ఇదే. ఎందుకంటే బీజేపీకి వచ్చిన ఓట్లు సుమారు 55 వేలు. అంటే కనీసం డిపాజిట్ కూడా రాలేదు. పైగా ఇందులో జనసేన ఓట్లుకూడా కలిసున్నాయి. తమ పార్టీకి ఎప్పుడు పోటీచేసినా కనీసం డిపాజిట్ కూడా దక్కదని  ఈ నేతలకు బాగా తెలుసు. అందుకనే జనాలను మాయచేయటానికి ప్రచారంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రచారంలో, మీడియా సమావేశాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడారు. తీరా కౌంటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడటానికి కనీసం ఒక్కరంటే ఒక్క నేతకూడా అడ్రస్ దొరకటంలేదు.



రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో సోమువీర్రాజు మీడియాతో మాట్లాడటానికి కూడా ఎందుకు జంకుతున్నారో అర్ధం కావటంలేదు. బీజేపీకి డిపాజిట్ దక్కితే ఆశ్చర్యపోవాలి కానీ దక్కకపోతే బాధపడాల్సిన పనేలేదు. మరి  ఈ విషయం తెలిసికూడా  విష్ణు, జీవిఎల్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి లాంటి వాళ్ళు ఎక్కడా అడ్రస్ లేకుండా పోవటమే ఆశ్చర్యంగా ఉంది. సరే బీజేపీ నేతలకంటే మొహం చెల్లటం లేదు. మరి జనసేన నేతలకు ఏమైంది ? వాళ్ళన్నా మీడియా ముందుకొచ్చి తమకు ఓట్లేసిన జనాలకు కృతజ్ఞతలు చెప్పవద్దా ? అంటే ఓడిపోయిన అభ్యర్ధి, పార్టీ అధ్యక్షుడు, నేతలకే లేని దురద తమకు మాత్రం ఎందుకని జనసేన నేతలు అడ్రస్ లేకుండా పోయారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: