హెరాల్డ్ సెటైర్ : ఇక జనసేనకు ఓటడిగేది ఎప్పుడు పవనూ

Vijaya
ప్రతి ఎన్నికలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంకు సంబంధించి వాళ్ళకు ఓటేయండి, వీళ్ళకు ఓటేయండి అని అడుగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ అభ్యర్ధికి ఓట్లేయమని ఎప్పుడు అడుగుతారు ? ఇపుడిదే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పార్టీ పెట్టి ఏడేళ్ళయినా ఇంత వరకు తిరుపతి లోక్ సభలో జనసేన అభ్యర్ధి పోటీచేసింది లేదు. ఆమాటకొస్తే 2014లో జనసేన అసలు పోటీనే చేయలేదు. మిత్రపక్షాలు తెలుగుదేశంపార్టీ, బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా పవన్ ప్రచారం మాత్రమే చేశారు. ఐదేళ్ళు గిర్రున తిరిగేసరికి మిత్రులుకాస్త ప్రత్యర్ధులుగా మారారు. అందుకనే టీడీపీ, బీజేపీలను వదిలిపెట్టేసి వామపక్షాలు, బీఎస్పీతో జతకట్టారు. పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు కొన్ని సీట్లను కేటాయించి జనసేన కొన్నింటిలో పోటీ చేసింది. అయితే పొత్తుల్లో కూడా తిరుపతి లోక్ సభలో జనసేన పోటీచేయలేదు.



నిజానికి వామపక్షాలకు కానీ బీఎస్పీకి కానీ ఓట్లేసే జనాలు లేరన్న విషయం అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిన విషయం కూడా పవన్ కు తెలీకపోవటంతో పై పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. మొత్తానికి మొత్తంగా కూటమిని జనాలు గుండుకొట్టి కూర్చోబెట్టారు. ఒక్క రాజోలులో మాత్రం వైసీపీలో నుండి జనసేనలో చేరి పోటీచేసిన రాపాక వరప్రసాద్ గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తర్వాత జరుగుతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారం చేశారు. హోలు మొత్తం మీద పవన్ రాజకీయ ప్రస్ధానం చూస్తే  ముందు 2009లో ప్రజారాజ్యంపార్టీ అభ్యర్ధికి ఓటేయమని అడిగారు. తర్వాత టీడీపీ అభ్యర్ధికి ఓటేయమన్నారు. 2019లో బీఎస్పీ క్యాండిడేట్ కు ఓట్లడిగారు. ఇపుడేమో బీజేపీ అభ్యర్ధికి ఓట్లేమంటున్నారు.



నిజానికి పవన్ పరిస్ధితి చాలా విచిత్రంగా ఉంది. పవన్ మూడు ఎన్నికల్లో ఎవరికి ఓట్లేయమని అడిగినా జనాలు ఆ అభ్యర్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. మొదటిసారి 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి చింతామోహన్ గెలిచారు. తర్వాత 2014లో వైసీపీ తరపున వరప్రసాద్ గెలిచారు. 2019లో బల్లి దుర్గాప్రసాద్ గెలిచారు. ఇపుడు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈసారైనా జనాలు పవన్ చెప్పిన అభ్యర్ధకి ఓట్లేస్తారేమో చూడాలి. మొత్తానికి పవన్ కే కాదు చివరకు ఆయన ప్రచారం చేసిన అభ్యర్ధులకు కూడా జనాలు ఓట్లేయకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: