హెరాల్డ్ సెటైర్ : డాక్టర్ రమేష్ మదర్ థెరెస్సాకు మారో రూపమా ? టిడిపి సర్టిఫికేట్

Vijaya
వివాదాస్పద డాక్టర్, పదకొండు మంది రోగుల మరణానికి కారకునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పోతినేని రమేష్ చౌదరికి టిడిపి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసింది.  విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్ హోటల్లో  కరోనా కేంద్రాన్ని నడుపుతున్న రమేష్ హాస్పిటల్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే.  ప్రమాదం జరగ్గానే ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. అప్పటి నుండి డాక్టర్ రమేష్ పరారీలో ఉన్నాడు. అలాగే భవనం యజమాని కూడా పరారీలోనే ఉన్నాడు. అసలు ప్రమాదం జరిగినప్పటి నుండి చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు, సిపిఐ కార్యదర్శి రామకృష్ణతో పాటు ఎల్లోమీడియా ఎక్కడా ప్రమాదం గురించి మాట్లాడటం లేదు. ఓ కరోనా కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మరణించటమన్నది రాష్ట్రంలోనే మొట్టమొదటి సంఘటన. అందుకనే ప్రభుత్వం కూడా ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది.



ప్రమాదం  జరిగిన తర్వాత విచారణలో భాగంగా  ఆసుపత్రికి చెందిన కొందరు కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అసలు వ్యక్తి రమేష్ మాత్రం ఇంకా తప్పించుకుని తిరుగుతున్నాడు. తనను అరెస్టు చేయకుండా అడ్డుకోవాలంటూ కోర్టులో పిటీషన్ కూడా వేశాడు.  ఎప్పుడైతే రమేష్ అరెస్టు తప్పదని అర్ధమైపోయిందో అప్పటి నుండే ప్రభుత్వం నుండి కమ్మ సామాజికవర్గం నుండి ఎదురుదాడులు మొదలైపోయాయి. ఎందుకంటే చంద్రబాబుకు రమేష్ చాలా సన్నిహితుడు. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని  కమ్మ సామాజికవర్గం ప్రముఖుల్లో  రమేష్ కూడా ఒకడు. అందుకనే రమేష్ పై చర్యలను కమ్మ సామాజికవర్గం మీద దాడిగా గోల చేస్తున్నారు. రమేష్ అరెస్టు కాకుండా కాపాడుకోవాలనే పట్టుదలతో కమ్మ సామాజికవర్గం పెద్దలంతా ఏకమైనట్లే అనుమానంగా ఉంది.



బాధ్యత గలిగిన ప్రధాన ప్రతిపక్షహోదాలో ఉన్న చంద్రబాబు హాస్పిటల్ నడుపుతున్న రమేష్ ను విచారణకు సహకరించమని చెప్పాల్సిందిపోయి రివర్సులో మాట్లాడుతున్నాడు. ఇందులో భాగంగానే టిడిపి ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రమేష్ ఎంతో సేవాభావంతో కరోనా సెంటర్ నడుపుతున్నట్లు చెప్పాడు. కరోనా వచ్చిన తన మిత్రుడిని చేర్చుకోమని తాను ఫోన్ చేసినా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవద్దంటు హితవు చెప్పాడట. మీడియా సమావేశంలో సదరు మిత్రుడితో కూడా మాట్లాడించాడు. ఇక్కడ ఎంఎల్సీ చెప్పదలచుకున్నదేమంటే రమేష్ డబ్బుల కోసం సెంటర్ నడపటం లేదని కేవలం సేవాభావంతోనే చికిత్స అందిస్తున్నాడని. కానీ అగ్నిప్రమాదం జరిగినపుడు ఆసుపత్రిలో ఉన్న 31 మంది రోగుల్లో 27 మందికి అసలు కరోనాయే లేదని ఆసుపత్రి రికార్డుల ప్రకారమే తేలిందికదా. పైగా ఆసుపత్రిలో చేరిన వాళ్ళ దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కంప్యూటర్ల ద్వారా బయటపడిన విషయాన్ని ఎంఎల్సీ మరచిపోయినట్లున్నాడు.



కరోనా పేరుతో రోగుల నుండి రమేష్ ఎంత ఫీజులు వసూలు చేశాడని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఆసుపత్రిలో ఉన్న కంప్యూటర్లే ఆ విషయాన్ని బట్టబయలు చేశాయి. రాజేంద్రప్రసాద్ సిఫారసు చేసిన రోగిని చేర్చుకుంటే డబ్బులు వసూలు చేయటం సాధ్యం కాదని వద్దని చెప్పేసుండచ్చు. చనిపోయిన 11 మంది రోగులకు ప్రభుత్వం టెస్టులు చేసినపుడు కూడా 7 మందికి నెగిటివ్ వచ్చిన విషయం అబద్ధమా ? మొత్తం మీద రమేష్ ను కాపాడటానికి టిడిపి ఎంఎల్సీ ఎదురుదాడి చేసినట్లు అర్ధమైపోతోంది.  డాక్టర్ ను డాక్టర్ లాగ చూడకుండా చంద్రబాబు దగ్గర నుండి క్రిందస్ధాయి కార్యకర్తల వరకు రమేష్ ను కమ్మ ప్రముఖునిగా చూడటం వల్లే సమస్యలు వస్తున్నాయి.  ఓపెన్ గా కమ్మ డాక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్న తమను జనాలు అసహ్యించుకుంటున్న విషయాన్ని టిడిపి నేతలు గుర్తిస్తున్నట్లు లేదు.



వైజాగ్ లో ఎల్జీ గ్యాస్ కంపెనీలో ప్రమాదం జరిగితే ఇదే చంద్రబాబు అండ్ కోతో పాటు ఎల్లోమీడియా ఎంతగా యాగీ చేసింది జనాలు మరచిపోలేదు. ప్రమాదం జరగ్గానే యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని నానా గోల చేశారు. విచారణ రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినా  వినిపించుకోలేదు. యాజమాన్యాన్ని తప్పించేందుకే జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కైనట్లు ఎన్ని ఆరోపణలు చేసింది అందరు చూసిందే. తీరా కమిటి రిపోర్టు వచ్చిన తర్వాత కంపెనీ సీఈవోతో పాటు మరికొందరిని అరెస్టు చేస్తే అసలా విషయాన్ని గురించి మళ్ళీ నోరెత్తలేదు. అంటే ఎల్జీ కంపెనీ యాజమాన్యానికి ఒక రూలు, డాక్టర్ రమేష్ కు మరో రూలు వర్తింపచేయాలని చంద్రబాబు అండ్ కో భావిస్తోందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే ప్రమాదం ప్రభుత్వ ఆసుపత్రిలోనో లేకపోతే మరో సామాజికవర్గం ఆసుపత్రిలోనో జరిగుంటే ఎల్లో బ్యాచ్ ఇలాగే మాట్లాడేదా ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: