హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కలల రాజధాని ఎంత దెబ్బ కొట్టబోతోందో తెలుసా ?
ఏమి జరిగిందంటే మొన్న జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోనే సమాధానం దొరుకుతుంది. దాదాపు 15 నిముషాల పాటు మాట్లాడిన చంద్రబాబు ’కావాలంటే 23 మంది ఎంఎల్ఏలమూ రాజీనామాలు చేసేస్తాం..మా పదవులన్నీ తీసేసుకోండి. రాజధానిగా మాత్రం అమరావతినే కంటిన్యు చేస్తామని ప్రకటించండి’ అంటూ జగన్మోహన్ రెడ్డికి బ్రతిమలాడుకున్నాడు. ఒక్క అమరావతి కోసం 23 మంది ఎంఎల్ఏలు ఎందుకు రాజీనామాలు చేయాలి ? అసలు అమరావతికి చంద్రబాబుకు అంత బాండేజ్ ఏమిటి ? లోకల్ సెంటిమెంట్ అనుకుంటే చంద్రబాబేమీ గుంటూరు జిల్లా వాసి కూడా కాదే. ఎక్కడో చిత్తూరు జిల్లా వాసికి అమరావతిలోనే రాజధాని ఉంచాలనే బలమైన కోరికేమిటి ?
ఇదే ప్రశ్న మామూలు జనాలకు అర్ధం కావటం లేదు. జగన్ మీడియా, ప్రభుత్వం ముందునుండి చెబుతున్నట్లు అమరావతిలో వేలాదిఎకరాలు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందా ? అనే అనుమానాలు బలపడిపోతున్నాయి. లేకపోతే అమరావతి కోసం తమ పదవులను వదులుకోవటానికి సిద్ధపడటం, ఉత్తరాంధ్ర, రాయలసీమలో వ్యతిరేకత వస్తుందని కూడా చంద్రబాబు ఆలోచించకపోవటమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇదే విషయాన్ని పై రెండు ప్రాంతాల్లోని నేతలు నెత్తి నోరు మొత్తుకుంటున్నా బహుశా చంద్రబాబు పట్టించుకునే స్ధితిని దాటిపోయినట్లున్నాడు. అమరావతి గురించి పదే పదే పట్టుబడుతున్న కొద్దీ జనాల్లో చంద్రబాబుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.