హెరాల్డ్ సెటైర్ : ఒక్క ట్వీట్ తో చంద్రబాబుతో పాటు టిడిపి గాలి తీసేసిన సొంత ఎంపి

Vijaya
కష్టాలు మొదలైతే ఒక్కటిగా రాదని పెద్దలంటుంటారు. చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తే ఈ విషయం నిజమే అని ఒప్పుకోవాల్సిందే.  మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి సమస్యలన్నీ ఒకేసారొచ్చి మీదపడినట్లుంది. తాజగా విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని చేసిన ట్వీట్ చూస్తే ఈ విషయం అర్ధమైపోతుంది. ఎంపి చేసిన ఒక్క ట్వీట్ తో చంద్రబాబుతో పాటు పార్టీ నేతల గాలి మొత్తం తీసేసినట్లయ్యింది. మరి ఏ ఉద్దేశ్యంతో నాని ట్వీట్ చేశాడో తెలీదు కానీ చేసిన ట్వీట్ మాత్రం చంద్రబాబును ఉద్దేశించే చేసినట్లుగా ప్రచారంలో సంచలనమైపోయింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడదామని చంద్రబాబు అనుకున్నా సాధ్యంకాలేదు. పోనీ పార్టీ నేతలన్నా తన పిలుపు విని ఉద్యమాలు చేశారా అంటే అదీ లేదు.



ఇదే సమయంలో మూడు రాజధానులపై హైకోర్టులో  కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ వల్ల చంద్రబాబు, ఎల్లోమీడియాపై పెద్ద బండపడినట్లే అయ్యింది. కేంద్రాన్ని చూపించి తాము రైతులను ఇంతకాలం చేసిన మోసం బయటపడిపోవటంతో చంద్రబాబుకు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు. ఈ సమయంలోనే నాని ట్వీట్ తో పార్టీలో మరింత గందరగోళంగా తయారైంది. ఇంతకీ నాని ఏమన్నాడు ? ఏమన్నాడంటే ’మన కలలను మనమే సాకారం చేసుకోవాల’న్నాడు. ఇందులో తప్పేమీ లేదు. మన కలలను ఎదుటివారు సాకారం చేయాలని అనుకోవటం అవివేకమన్నాడు. ఇందులో కూడా తప్పేమీలేదు. రెండోసారి ఎంపి కాబట్టి ప్రజల ఆలోచనను సరిగానే అర్ధం చేసుకున్నాడనే అనుకోవాలి.



ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు కన్న కలలు సాకారం కావాలంటే 2024లో టిడిపి అధికారంలోకి రావాలంటూ కోరుకున్నాడు. టిడిపి అధికారంలోకి రావాలని పార్టీ ఎంపిగా కోరుకోవటంలో కూడా తప్పేమీలేదు.  లక్ష్యం దిశగా పార్టీలోని అందరూ పాటుపడాలి అని చెప్పటంలో కూడా వాస్తవముంది. కానీ చివరి వాక్యంతోనే పైన చెప్పిందంతా ఒక్కసారిగా గాలికి కొట్టుకుపోయింది. చివరి వాక్యం ఏమిటంటే ’మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్ల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు’ అని ఎందుకు చెప్పాడో ? ఎవరిని ఉద్దేశించి చెప్పాడో కూడా అర్ధం కావటం లేదు. ఎందుకంటే మీడియా సమావేశాలు పెడుతున్నది, కేవలం పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది చంద్రబాబు, దేవినేని ఉమ, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నారా లోకేష్ అండ్ కో మాత్రమే.



ప్రతిరోజు లేదా రెండు రోజులకోసారి మీడియా సమావేశాలంటూ జనాలతో పాటు మీడియా బుర్రలు తినేస్తున్నది చంద్రబాబు మాత్రమే. ఇక దేవినేని, బుద్దా, బోండా లాంటి వాళ్ళు అప్పుడప్పుడు జూమ్ యాప్ లోనే చంద్రబాబు తరహా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక నారా లోకేష్ అయితే కేవలం ట్విట్టర్ వేదికగా ట్వీట్లతోనే కాలం గడిపేస్తున్నాడు.  నిజానికి మూడు రాజధానుల ప్రతిపాదనపై పార్టీలోని ముగ్గురు ఎంపిలు ఇంతవరకూ నోరిప్పిందే లేదు. ఈ ముగ్గురిలో కూడా కేశినేని నాని, గల్లా జయదేవ్ లు రాజధాని పరిధిలోని నియోజకవర్గాల్లోనే గెలిచారు. గల్లా గుంటూరు ఎంపిగాను, కేశినేని విజయవాడ ఎంపిగా గెలిచిన విషయం తెలిసిందే. కేశినేని అన్నా కనీసం ఈ ట్వీట్ అన్నా పెట్టాడు. గల్లా అయితే అసలు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు.  మొత్తానికి స్పందిచక స్పందిచక ఒక్కసారి స్పందించిన నాని తన ట్వీట్ తో చంద్రబాబు, పార్టీ గాలి తీసేశాడంటూ మిగిలిన నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: