హెరాల్డ్ సెటైర్ : మరోసారి అడ్డంగా దొరికిపోయిన టిడిపి..ఎక్కడి నుండి పట్టుకొస్తారో

Vijaya
బాగా జాగ్రత్తగా చూడండి పై ఫొటోను. సోమవారం విజయవాడలో మీడియా సమావేశం పెట్టి  ఎంపి భర్తపై ఆర్ధిక ఆరోపణలు చేసి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన మనిషే ఈవిడ. బొల్లిపల్లి శాంతకుమారి అనే తనను ఉత్తరాంధ్రకు చెందిన ఓ  ఎంపి భర్త మోసం చేశాడని ఆరోపించటమే కాకుండా ప్రెస్ మీట్లోనే పరుగులమందు తాగేసి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సరే మీడియా సమావేశంలోనే ఘటన జరిగింది కాబట్టి వెంటనే స్పందించిన విలేకరులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. తర్వాత అంబులెన్సులో వెళ్ళిన శాంతకుమారి ఆసుపత్రిలో చేరింది. వైసిపి నేతకు  వ్యతిరేకంగా ఆరోపణలు చేయటమే కాకుండా తన ప్రెస్ మీట్లో రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి, కారెం శివాజీ పేర్లు కూడా చెప్పింది కాబట్టి సహజంగానే ఎల్లోమీడియా విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చేసింది.

సీన్ కట్ చేస్తే సదరు మహిళను  వైసిపి సోషల్ మీడియా దుమ్ము దులిపేస్తోంది. వైసిపి మహిళా నేతగా చెప్పుకుంటున్న సదరు మహిళ తెలుగుదేశంపార్టీలో యాక్టివ్ కార్యకర్తట. తెలుగుదేశంపార్టీ  అధికారంలో ఉన్నపుడు అనేక సందర్భాల్లో చంద్రబాబునాయుడు, లోకేష్, దేవినేని ఉమా మహేశ్వరరావు, తంగిరాల సౌమ్య తదితరులతో దిగిన ఫొటోలను పోస్టు చేస్తున్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన ఆందోళనల్లో కూడా సదరు మహిళ పాల్గొన్న ఫొటోలను సర్క్యులేషన్ లోకి పెట్టారు.  మరి టిడిపి కార్యక్రమాల్లో  ఇంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న మహిళ తనను తాను వైసిపి మహిళా నేతగా ఎలా పరిచయం చేసుకుంటోందో అర్ధం కావటం లేదు. దీనికి మీడియా కూడా ఇంత పెద్ద స్ధాయిలో ప్రచారం ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

పోనీ వైసిపి వచ్చిన తర్వాత అధికార పార్టీలో చేరిందే అనుకుందాం. ఓ పోస్టు కోసం తన దగ్గర రూ. 13 లక్షలు తీసుకున్న సదరు ఎంపి భర్త ఎవరని అడిగితే నోరిప్పి చెప్పటం లేదు. పురుగుమందు తాగి చనిపోవాలని నిర్ణయం తీసుకున్న సదరు మహిళా నేత తన దగ్గర డబ్బులు తీసుకున్న ఎంపి భర్త పేరు చెప్పటానికి ఎందుకు వెనకాడుతోంది. పోనీ ఏదో ఓ పోలీసు స్టేషన్లో ఎంపి భర్తపై ఫిర్యాదు చేయవచ్చు కదా ? ఎందుకా పనిచేయలేదు. ఇక్కడే ఈమెను వైసిపి సోషల్ మీడియాలో ’మహానటి’తో పోలుస్తు పోస్టులు పెడుతున్నారు. ఈమె అసలు వైసిపి నేతే కాదు పొమ్మంటున్నారు. చంద్రబాబు ఆడించిన డ్రామాలో ఈమె కూడా ఓ పావు మాత్రమే అని వైసిపి నేతలు కొట్టిపారేస్తున్నారు.

ఈమెను పావుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారంటే గతంలో విశాఖపట్నం జిల్లాలోని డాక్టర్ సుధాకర్, చిత్తూరు జిల్లాలోని డాక్టర్ అనితారాణి వ్యవహారం కూడా ఇటువంటివే అని తేలిపోయింది కాబట్టి. వైసిపి ప్రభుత్వంపై బురద చల్లించేందుకు, వీలున్నంతలో ఎస్సీ సామాజికవర్గాన్ని పార్టీకి దూరం చేసేందుకు పై ఇద్దరు డాక్టర్లను టిడిపినే రంగంలోకి దింపినట్లు అప్పట్లో అనేక ఆరోపణలు వెలుగుచూశాయి. తాజాగా శాంతకుమారి వ్యవహారం కూడా ఇలాంటిదే అని వైసిపి సోషల్ మీడియా విభాగం తేల్చేసింది. గతంలో భారీ వర్షాలు, వరదల సమయంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించి జగన్ కు వ్యతిరేకంగా ఘోరంగా మాట్లాడించింది. సరే తర్వాత వాళ్ళంతా అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు లేండి.  అందుకనే ఇంకా ఎంతమంది మహానటి, నటులను తెలుగుదేశంపార్టీ  రంగంలోకి దింపుతుందో అని జనాలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: