గొప్పోల్రా బాబు..! ఈ సంగతి కరోనాకి తెలిస్తే..?

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ జనాలు చాలా ధైర్యవంతులై కాదు, చాలా మొండివాల్రా బాబు. దేనికి జడవకుండా మొండి మొండిగా తిరిగేస్తారు. కరోనా మంచికి వచ్చిందో చెడుకి వచ్చిందో తెలియదు కానీ, జనాల్లో ఏదో తెలియని భయాన్ని, ఆందోళనని మాత్రం రేపింది. అసలు ఈ కరోనా కంటే కంగారు పెట్టే విషయాలు చాలానే జరిగిపోతున్నాయి అంటూ జనాలు ఎక్కడా అదురు బెదురూ లేదు అన్నట్టుగా ఉంటున్నారు. కరోనా మమ్మల్ని ఏం చేస్తుంది...? ఇలాంటివి ఎన్నో చూశాము అంటూ నిర్లక్ష్యంతో గడిపేవారు ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తున్నారు. అసలు జనాలు సంగతి ముందే ప్రధాని కి తెలుసు కాబట్టే మొదటి రెండు విడతలు కఠినంగా లాక్ డౌన్ అమలు చేశారు. అంతేనా ఎవరైనా రోడ్లపై కనబడితే కాళ్లు చేతులు వచ్చేలా దెబ్బలు తిన్నారు. జనాల్లో మార్పు అయితే కనిపించడం లేదు కానీ, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు ఏదో ఒక సాకుతో రోడ్లపైకి వచ్చేందుకు ఎక్కువ మొగ్గు చూపించారు.  

 


 ఇక లాభం లేదనుకున్నారో ఏమో కానీ, మూడో విడత నుంచి సడలింపుల పేరుతో జనాలు రోడ్లపైకి తిరిగేందుకు ప్రభుత్వాలు అవకాశం ఇవ్వడంతో, ఇక దొరికిందే సందు అన్నట్లుగా, రోడ్ల పైకి రావడమే కాకుండా, గతం కంటే ఇప్పుడు మరింతగా గుంపులు గుంపులుగా తిరుగుతూ, బండి మీద వెళ్ళినప్పుడు మాస్కు పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు అన్న ఒక్క కారణంతో ఆ మాస్క్ అయినా పెట్టుకుంటున్నారు తప్ప నిజంగా ఈ వైరస్ మహమ్మారి విస్తరించకుండా తమ వంతు బాధ్యతగా మాస్కు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటివి ఎక్కడా పాటిస్తున్నట్లు పెద్దగా కనిపించడం లేదు. సుమారు రెండు నెలలకు పైగా లాక్ డౌన్ నిబంధనలతో జనం విసిగిపోయినట్టుగా కనిపిస్తున్నారు. 

 

ప్రభుత్వాలు, ప్రజల మంచి కోసమే ఈ నిబంధనలు విధించారు అనే సామాజిక స్పృహ ఎక్కడా జనాల్లో కనిపించడం లేదు. మమ్మల్ని కరోనా ఏం చేస్తుందిలే అన్న నిర్లక్షమే ఎక్కువగా ఉంది. ఈ జనాల నిర్లక్ష్యం కారణంగానే ఒకరి నుంచి ఒకరికి ఇప్పుడు వైరస్ విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. కరోనా లేదు గిరోనా లేదు అంటూ మెజారిటీ ప్రజలు చాలా నిర్లక్ష్యంగా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణాల్లో కాస్త దీనిపై అవగాహనతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా, పల్లెటూర్లలో మాత్రం ఎక్కడా ఎవరూ పెద్దగా కరోనాని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈ కరోనా అంత సులువుగా మాకు రాదులే అన్న నిర్లక్ష్యం పల్లె జనాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. 


పట్టణాల నుంచి వచ్చినవారు ఈ కరోనా జాగ్రత్తలు పల్లె జనాలకు చెబుతూ, ఏంటి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని ప్రశ్నిస్తే ? ఏ కరోనాని మా ఊరికి రమ్మని చెప్పి వచ్చావా ఏంటి ? లేక నువ్వేమైనా మా ఊరికి తీసుకొచ్చావా అంటూ ఎటకారం చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఇందులో ఉన్న సీరియస్ నెస్ ఎవరూ గుర్తించడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: