క్రేజీ టీ 20 క్రికెట్ : టార్గెట్ తక్కువే... అయినా చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ !

VAMSI
ఆస్ట్రేలియా టీ 20 దేశవాళీ లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. మనకు ఐపీఎల్ ఎలాగో... కంగారూలకు బిగ్ బాష్ అలాగన్నమాట. గత రెండు సీజన్ లు అభిమానులు లేకుండా కోవిడ్ నిబంధనలతో జరిగిన బిగ్ బాష్ లీగ్... ఈసారి అభిమానుల మధ్యన ఎంతో అట్టహాసంగా ప్రారంభం అయింది. సీజన్ ఓపెనర్ లో మెల్బోర్న్ స్టార్స్ మరియు సిడ్నీ థండర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన థండర్స్ కెప్టెన్ జాసన్ సంఘా మొదట ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. అయితే మాక్స్ వెల్ గైర్హాజరీలో కెప్టెన్ గా ఆడం జంపా జట్టును ముందుండి నడిపించాడు. అయితే ఎప్పటిలాగానే స్టార్ జట్టు థండర్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో ఫెయిల్ అయింది.
స్టార్స్ జట్టు నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంచనాలు పెట్టుకున్న జో క్లార్క్ (11), స్టాయినిస్ (0) లు జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించడంలో దారుణంగా విఫలం అయ్యారు. ఇక స్టార్స్ ను తక్కువ స్కోర్ కు కట్టడి చేయడంలో సందు , ఫజల్ హాక్ ఫరూఖీ , సామ్స్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన థండర్స్ జట్టు స్టార్టింగ్ నుండి క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఈ జట్టులోనూ తోపులు అనుకున్న వారు కూడా తోక ముడిచారు. హేల్స్ (16) మరియు రాసౌ (0) లు కూడా పరుగులు చేయలేక చతికిలపడ్డారు. ఒక దశలో గెలుపు ఎవరికి దక్కుతుందో అంతుబట్టని పరిస్థితి ఎదురైంది.
ఓవర్ ఓవర్ కు గెలుపు రెండు జట్ల చేతులు మారుతూ వెళ్ళింది. అంత తక్కువ స్కోర్ ను ఆఖరి బంతి వరకు తీసుకు రాగలిగారు స్టార్స్ బౌలింగ్ యూనిట్. ఆఖరి ఓవర్ కు థండర్స్ ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా బౌలింగ్ చేస్తున్న వెబ్ స్టర్ మొదటి రెండు బంతులకు గ్రీన్ మరియు ఫజల్ హాక్ ఫరూఖీ లను అవుట్ చేశాడు. ఇక మిగిలిన నాలుగు బంతులకు ఎనిమిది చేయాల్సిన దశలో విజయం స్టార్స్ దే అనుకున్నారు అంతా, మూడవ బంతికి సింగిల్ వచ్చింది... కానీ నాలుగవ బంతికి సందు సిక్సర్ కొట్టడంతో ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. ఇక మరో రెండు బంతులకు ఒక పరుగు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత బంతి డాట్ అయింది. ఆఖరి బంతిని బ్యాట్స్మన్ మిస్ అవడంతో కీపర్ కూడా వదిలేసి అది కాస్తా ఫోర్ వెళ్లిపోయింది. అలా తక్కువ లక్ష్యం అయినా చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠలో థండర్స్ విజయం సాధించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: