బంగ్లాతో "చావో రేవో" మ్యాచ్ లో ఇండియా ఇలా చేస్తే సరి ?

VAMSI
మొదటి వన్ డే లో ఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ పై ఓడిపోయిన టీం ఇండియా మరో సమరానికి సిద్ధం అవుతోంది. రేపు ఉదయం 11 .30 గంటలకు ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియం లో రెండవ వన్ డే జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తేనే సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంటుంది, లేదా మొదటి వన్ డే ఫలితమే పునరావృతం అయితే బంగ్లాకు సిరీస్ దక్కుతుంది. ఇటువంటి కీలక వన్ డే లో ఇండియా ఎటువంటి ప్రణాళికలను చేసుకుని బరిలోకి దిగనుంది అన్న విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటమి నుండి ఇండియా టీం పాఠాలు నేర్చుకుంటుందా అన్నది ఇంకో రోజులో తెలియనుంది.
రేపటి మ్యాచ్ లో బంగ్లాను ఓడించాలంటే ఇండియా ఈ విషయాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంది.
ఓపెనర్లు భాగస్వామ్యం: గత మ్యాచ్ లో ఓపెనర్లుగా వచ్చిన శిఖర్ ధావన్ మరియు రోహిత్ శర్మలు మొదటి వికెట్ కు కేవలం 23 పరుగులు మాత్రమే జోడించారు. ఆ తర్వాత రోహిత్ అయినా నిలకడగా ఆడి భారీ స్కోర్ గా మలిచాడా అంటే అదీ లేదు. అందుకే మొదటి వికెట్ కు కనీసం 50 పరుగులు అయినా చేస్తే వెనుక ఉండే ఆటగాళ్లకు దైర్యం ఉంటుంది, తద్వారా భారీ స్కోర్ ను టార్గెట్ పెట్టగలుగుతారు. రేపటి మ్యాచ్ లో అయినా ఓపెనర్లు రాణిస్తారా లేదా చూడాల్సి ఉంది.
ఫీల్డింగ్ తప్పిదాలు: ఒక మ్యాచ్ విన్ అవ్వాలంటే అన్ని విషయాలలో సరిగా రాణిస్తేనే కుదురుతుంది. ముఖ్యంగా ఫీల్డింగ్ అన్నది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మొదటి వన్ డే లో కీలక సమయంలో కె ఎల్ రాహుల్ క్యాచ్ ను వదిలేయడం వలన మ్యాచ్ ఓడిపోయింది. అందుకే ఒక్క క్యాచ్ ను కూడా జారవిడవకూడదు... ఫీల్డింగ్ కోచ్ లు ఈ విషయంలో తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సి ఉంది.
వికెట్లు తీయడం : ప్రత్యర్థికి ఎప్పుడూ ఏ ఇద్దరి బ్యాట్స్మన్ లను ఎక్కువ పరుగులు తీసే అవకాశం బౌలర్లు ఇవ్వకుండా వారిని వికెట్ తీసి విడదీయాలి. అప్పుడే మ్యాచ్ లో గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు గత మ్యాచ్ లో కస్టపడి చేతులోకి వచ్చిన మ్యాచ్ ను ఆఖరి వికెట్ ను పడగొట్టలేక వారిదగ్గర 51 పరుగుల భాగస్వామ్యం నమోదయ్యేలా చేశారు ఇండియన్ బౌలర్లు.  
ఈ మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండి పాటిస్తే కేవలం ఈ ఒక్క సిరీస్ మాత్రమే కాదు. ఏ జట్టుతో మ్యాచ్ జరిగిన మనదే పైచేయి అవుతుంది.  

   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: