రషీద్ ఖాన్ బౌలింగ్ పై నిరాశలో ఆఫ్ఘన్ జట్టు ?

VAMSI
ప్రపంచ క్రికెట్ లో ఆఫ్గనిస్తాన్ కు చెందిన లెగ్ బ్రేక్ బౌలర్ రషీద్ ఖాన్ కున్న ప్రత్యేకత గురించి వేరే చెప్పనక్కర్లేదు. గింగిరాలు తిరిగే బంతులతో ఎంతటి బ్యాట్స్మన్ ను అయినా ముప్పతిప్పలు పెట్టగల సమర్ధుడు. ముఖ్యంగా ఐపీఎల్ లో ఇతనికి అభేద్యమైన రికార్డు ఉంది. ప్రస్తుతం ఐసీసీ టీ 20 ఇంటర్నేషనల్ బౌలర్లు ర్యాంకింగ్స్ లోనూ ఇతను అయిదవ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. అయితే ఇంతకు ముందు మొదటి ర్యాంక్ లో ఉన్న రషీద్ ఖాన్ తన బౌలింగ్ లో అంత ప్రభావవంతంగా లేక వికెట్లను తీయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. దీనికి సాక్ష్యమే గత రాత్రి ముగిసిన ఐర్లాండ్ టీ 20 సిరీస్ లో తన తీసికట్టు ప్రదర్శన.
ఆఫ్గనిస్తాన్ జట్టు ఆగష్టు 9 నుండి ఐర్లాండ్ పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా అయిదు టీ 20 మ్యాచ్ లను ఆడింది. అయితే ఈ సిరీస్ లో పూర్తి ఆధిపత్యాన్ని ఐర్లాండ్ జట్టు చలాయించింది అని చెప్పాలి. మొదటి రెండు మ్యాచ్ లను ఐర్లాండ్ గెలుచుకోగా, ఆ తర్వాత రెండు మ్యాచ్ లను ఆఫ్గనిస్తాన్ గెలుచుకుని సిరీస్ ను సమం చేసింది. ఇక నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ లో ఇరు జట్లు తప్పక గెలవాల్సి ఉండగా... ఐర్లాండ్ తన ఆటతీరుతో మ్యాచ్ ను మరియు సిరీస్ ను చేజిక్కించుకుంది. మరో వారం రోజుల్లో ఆసియా కప్ లో పాల్గొనాల్సి ఉండగా, ఇటువంటి సందర్భంలో ఆఫ్గనిస్తాన్ కు ఈ సిరీస్ ఓటమి మంచిది కాదు.
అయితే ఈ ఓటమిలో ప్రధాన పాత్ర మాత్రం మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ది అని చెప్పాలి. ఈ సిరీస్ లో రషీద్ ఖాన్ అంత ప్రభావవంతంగా కనిపించలేదు. అయిదు మ్యాచ్ లలో కలిపి కేవలం 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు అంటే... తన బౌలింగ్ లో పదును తగ్గిపోయింది. మొత్తం 17 ఓవర్లు వేసి 102 పరుగులు ఇచ్చుకున్నాడు. దీనితో ఆఫ్గనిస్తాన్ శిబిరంలో నిరాశ అలుముకుంది. ఆసియా కప్ లో అయినా రషీద్ ఖాన్ రాణించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: