వరల్డ్ కప్: ఆస్ట్రేలియా చేతిలో విండీస్ చిత్తు... సెమీస్ ఆశలు గల్లంతు

VAMSI
ఈ రోజు ఉదయం జరిగిన మహిళల ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్యన ఆక్లాండ్ వేదికగా జరిగింది. ముందుగా టాస్ గెలిచిన విండీస్ అనూహ్యంగా మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఆరంభం నుండి తడబడుతూ ఆడిన వెస్ట్ ఇండీస్ మహిళలు ఏ దశలోనూ కంఫర్ట్ గా కనిపించలేదు. వరుస వికెట్లు కోల్పోతూ వచ్చిన వెస్ట్ ఇండీస్ ను కెప్టెన్ స్టెఫానీ టేలర్ అర్ధ సెంచరీతో రాణించి కనీసం 131 పరుగులు చేయడంలో సహాయపడింది. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అలా వెస్ట్ ఇండీస్ తన ఇన్నింగ్స్ ను 45.5 ఓవర్లకు 131 పరుగుల వద్ద ముగించింది. ఆస్ట్రేలియా బౌలర్ లలో ఎలిసా పెర్రీ మరియు గార్డనర్ లు తలో మూడు వికెట్లు సాధించి వెస్ట్ ఇండీస్ పతనాన్ని శాసించారు.
132 పరుగుల లక్ష్యంతో చేధనకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళలు ఆరంభంలోనే 2 కీలక వికెట్లు కోల్పోయి తడబడింది. అయినా లక్ష్యం చిన్నది కావడంతో ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ 30 ఓవర్ల 2 బంతుల్లో ఛేదించి టోర్నీలో వరుసగా నాలుగవ విజయాన్ని నమోదు చేసుకుంది. మరోసారి ఆస్ట్రేలియా ఛేదనలో రాచెల్ హేన్స్ 85 పరుగులతో రాణించి నాట్ అవుట్ గా నిలిచింది. దీనితో అనధికారికంగా సెమీస్ కు చేరిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. కాగా వెస్ట్ ఇండీస్ కు ఈ టోర్నీలో ఇది రెండవ ఓటమి కావడం విశేషం. అయితే ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ లలో రెండు గెలిచి రెండు ఓడింది.
ఇక మిగిలిన మూడు మ్యాచ్ లలో మూడు గెలవాలి లేదా రెండింటిలో గెలిచినా భారీ రన్ రేట్ ను సాధించాలి. అప్పుడే వెస్ట్ ఇండీస్ కు సెమీస్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ టోర్నీలో సెమీస్ కు చేరని జట్లు ఏవో ఇప్పటికే ఒక అంచనాకు రాగలము. ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని పాకిస్తాన్, ఇంగ్లాండ్ మరియు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన బాంగ్లాదేశ్ లు సెమీస్ కు చేరడం దాదాపు అసాధ్యమే. దాని ప్రకారం చూసుకుంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా మరియు న్యూజిలాండ్ లు సెమీస్ కు చేరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: