వింబుల్డన్‌ ఫైనల్లో జొకో, ఫెడెక్స్‌?

Sanjay
స్పెయిన్ బుల్‌ రఫెల్‌ నడాల్‌, యూఎస్‌ ఓపెన్ విజేత.. ఆస్ట్రియా యువ‌ కెరటం డొమినిక్‌ థీమ్‌ గాయం కారణంగా వింబుల్డన్‌ టైటిల్‌ వేట నుంచి తప్పుకోవడంతో అందరి కళ్లు దిగ్గజాలు రోజర్‌ ఫెడరర్‌, జొకోవిచ్ పై పడ్డాయి. ఏదొక గాయం, ఫిట్‌నెస్‌ సమస్యలతో మూడేళ్లుగా ఒక్క గ్రాండ్‌స్లామ్‌ గెలవలేకపోయినా స్విస్ ఛాంపియ‌న్ ఫెడెక్స్‌.. ఈ వింబుల్డన్‌తోనైనా తన టైటిళ్ల దాహాన్ని తీర్చుకోవాలని ఆరాటపడుతున్నాడు. పచ్చిక కోర్టు గ్రాండ్‌స్లామ్‌లో ఈ దఫా ఎలాగైనా విజేతగా నిలవాలనే కృతనిశ్చయంతో బరిలోకి దిగుతున్నాడు.


అయితే, సెమీస్‌ వరకు ఫెడరర్‌కు పెద్దగా పోటీ ఎదురుకాకపోయినా టైటిల్‌ ఫైట్‌లో మాత్రం వరల్డ్‌ నెంబర్‌వన్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను ఓడిస్తేనే టైటిల్‌ ఫెడెక్స్‌ సొంతమవుతుంది. సోమవారం నుంచి జరిగే వింబుల్డన్‌ కోసం ఆటగాళ్ల డ్రాను విడుదల చేయగా ఫెడరర్‌, జొకోవిచ్‌ వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండడంతో ఫైనల్లో ఎదురుపడే అవకాశముంది. 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో ఉన్న ఆరోసీడ్‌ ఫెడరర్‌.. రెండేళ్ల క్రితం ఇదే వేదికపై ఫైనల్లో సెర్బియా యోధుడు జొకోవిచ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. స్థానిక టీనేజర్‌, 19 ఏళ్ల జాక్‌ డ్రేపర్‌తో జొకో, ఫ్రాన్స్‌కు చెందిన అడ్రియన్‌ మన్నారియోతో 8సార్లు విజేత ఫెడరర్‌ తొలిరౌండ్లో తలపడనున్నారు. 


క్వార్టర్‌ఫైనల్లో ఐదోసీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌తో జోకోవిచ్‌, రెండోసీడ్‌ మెద్వెదేవ్‌తో ఫెడరర్‌, మూడోసీడ్‌ సిట్సిపాస్‌తో 8వ సీడ్‌ రాబర్టో బటిస్టా, ఏడోసీడ్‌ బెర్రెటినితో నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ అమీతుమీ తేల్చుకునే ఛాన్సుంది. 2017 తర్వాత తొలిసారి ఇక్కడ సింగిల్స్‌ ఆడుతున్న లోకల్‌ హీరో ఆండీ ముర్రే తన పోరును 24వ సీడ్‌ నికోలస్‌ బాషిస్వెలితో ప్రారంభించనున్నాడు. వింబుల్డన్‌లో తొలిసారిగా చైనా ఆటగాడు పోటీలో నిలిచాడు. 24 ఏళ్ల జాంగ్‌ జిజెన్‌ సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌లో మూడు మ్యాచ్‌లు గెలుపొంది మెయిన్‌ డ్రాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటిదాకా చైనా నుంచి మహిళల సింగిల్స్‌లో నా లీ మాత్రమే ఈ వేదికపై అత్యుత్తమంగా రాణించింది. మహిళల సింగిల్స్‌లో ఈసారి టాప్‌ త్రీ ప్లేయర్స్‌లోని సిమోనా హలెప్‌ ఎడమ కాలి పిక్క గాయంతో, నవోమి ఒసాకా వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలగడం తెలిసిందే. దీంతో డ్రా ప్రకారం క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ యాష్లే బార్టీతో ఐదోసీడ్‌ బియాంక ఆండ్రెస్కూ, మూడోసీడ్‌ స్విటోలినాతో ఆరోసీడ్‌ సెరెనా విలియమ్స్‌ తలపడే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: