శ్రీకృష్ణుని గురించి తెలియని నిజాలు

Hareesh
మానవాళికి హిత బోధ చేసే గురువుగానే కాకుండా కష్టాల్లో ఉన్న దీనజన బాంధవుడిగా ... గోవర్థనోద్దారకుడిగా శ్రీకృష్ణుడు తనదైన ముద్ర వేశాడు. అయితే  ఆ పరమాత్మ వద్ద నెమలిపింఛం, వెన్నముద్ద, వేణువు, గోవులు… ఎక్కువగా కనిపిస్తాయి. అటువంటి చిహ్నాలకూ ప్రత్యేకత ఉంది...  తెలుసా? అవును ఆయా చిహ్నాలకు ఒక్కో, అర్థం... పరమార్థమూ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదాన్ని చూసినా కూడా ఆ మురళీకృష్ణుడే ప్రతిబింబిస్తాడు. గోపాలుడిగా... వెన్న దొంగగా... చిలిపి కృష్ణినిగా... దామోదరుడిగా... ఇలా ఎన్ని నామాలు చెప్పుకున్నా... ఒక్కో నామానికీ ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే ఆయన దగ్గర ఉండే  నాలుగు చిహ్నాలకు చాలా ప్రత్యేకత ఉంది... అంతేకాదు ఆ చిహ్నాలు

పరమాత్ముని తత్వానికి సంకేతాలు...

ప్రకృతిని చూసి పరవసించే ఏకైక జీవి నెమలి. మబ్బు తునక కనిపించినా చాలు మురిసిపోయి పురివిప్పి ఆడే ధన్యజీవి. అందుకు ప్రకృతి కూడా బదులుగా, తనలోని సప్తవర్ణాలనూ అద్దినట్లుగా ఉంటుంది నెమలి ఫించం.వాటిద్వారా త‌నివితీరా చూసుకోమంటూ వేయి క‌న్నుల‌నిచ్చింది. అందుకే ఆ ప్ర‌కృతికే పురుషుడైన కృష్ణునికి ఇష్ట‌మైన ఆభ‌ర‌ణం నెమ‌లి పింఛం అయింది.. అది కృష్ణుని కిరీటంలో పొందికగా ఒదిగింది.. నెమ‌లికి కాలం క‌లిసివ‌చ్చిన‌ప్పుడు పురివిప్పి ఆడ‌ట‌మే కాదు, స‌మ‌యం త‌న‌ది కాదు అనుకున్న‌ప్పుడు రెక్క‌ల‌ను ముడుచుకుని ఏ కొమ్మ చాటునో ఒద్దిక‌గా ఉండ‌ట‌మూ తెలుసు. అంటే విన‌యానికి, విజ‌యానికి సూచికే నెమలిఫించం.. ‌ఇది మానవులకు జీవితాన్నీ ప‌రిపూర్ణంగా ఆస్వాదించ‌మ‌నీ, ప‌రిప‌క్వంగా ప్ర‌వ‌ర్తించ‌మ‌నీ తెలియ‌చేస్తుందన్న‌మాట‌. అందుకేనేమో… నెమ‌లి పింఛం ఇంట్లో ఉంటే దుష్ట‌శ‌క్తులు ద‌రిచేర‌వ‌ని కొంద‌రు న‌మ్ముతారు. ఇక వేణువు.. స‌ప్తస్వ‌రాల‌ను ప‌లికించ‌గ‌ల పురాత‌న‌మైన సంగీత ప‌రిక‌ర‌మే కాదు… నిరంత‌రం ఆ చిన్ని క‌న్న‌య్య పెద‌వుల‌ను ముద్దాడిన భాగ్య‌శాలి.. 


నెమ‌లి త‌న ప‌ర‌వ‌శాన్ని ఆట ద్వారా వ్య‌క్తీక‌రిస్తే, వేణువు అదే ప‌ర‌వ‌శాన్ని త‌న పాట‌లో వినిపిస్తుంది. ఆధ్మాత్మిక‌ప‌రంగా చూసినా వేణువుకి ఉన్న ప్ర‌త్యేక‌త అంతా ఇంతా కాదు. వేణువు మ‌న వెన్నుని త‌ల‌పిస్తుంది. అందులోంచి క‌నుక ష‌ట్చ‌క్రాల‌ను క‌నుక మేల్కొల్ప‌గ‌లిగితే జీవ‌న‌నాదం వినిపిస్తుంద‌ని సూచిస్తుంది.నిరంతంరం ఆ వేణువు అలా క‌న్న‌య్య చెంత‌నే ఉండ‌టం చూసి గోపిక‌ల‌కు సైతం అసూయ కలిగిందట. అందుకే గోపికలంతా కలిసి ఒకసారి వేణువుని అడిగారట.. నువ్వు మా గోపాలునికి ఎందుకంత ప్రత్యేకం అని..అప్పుడు వేణువు నా లోప‌ల అంతా శూన్య‌మే, ఆ కార‌ణంగానే క‌న్న‌య్య న‌న్ను ఎలా కావాలంటే అలా మ‌లుచుకునే అవ‌కాశం ఇవ్వ‌గ‌లుగుతున్నాను. అందుకే క‌న్న‌య్య‌కు నేను ప్రత్యేకం అని చెప్పింద‌ట‌. దీని అర్ధం మనం కూడా అరిష‌డ్వర్గాలు నిండిన మ‌న మ‌న‌సుని క‌నుక ఖాళీ చేసుకోగ‌లిగితే… అంత‌కు మించిన క‌ర్మ‌యోగం మ‌రేముంటుంది? గీత‌లో కృష్ణుడు చేసిన బోధ కూడా ఇదే సూచిస్తుంది… వెన్న‌ముద్దని ఎవరు చుసిన మొదట గుర్తొచ్చేది బాలకృష్ణుని ముద్దు చేష్టలే.. చిన్ని కృష్ణుని ‌లీల‌ల‌లో వెన్న దొంగ‌త‌నాన్ని మించిన మ‌ధుర‌మైన ఘట్టం లేదు.. ఈనాట‌కీ కృష్ణ‌జ‌న్మాష్ట‌మి వేడుక‌ల‌లో ఉట్టి ప‌గుల‌కొట్టే సంప్ర‌దాయాన్నీ పాటిస్తున్నాం… 


చిన్న పిల్లలెవరికైనా మధురం ఇష్టం ఉంటుంది కానీ బుల్లి కిట్టయ్య వెన్న‌నే ఎందుకు దొంగిలించిన‌ట్లు.. ఎందుకంటే వెన్న శుద్ధ‌రూపానికి ప్ర‌తీక‌. నీరులా క‌నిపించే పాల‌ని ప‌దే ప‌దే శ్ర‌మ‌కోర్చి చిలికితే బ‌య‌ట‌ప‌డే అంతఃరూపం.ప్ర‌తి మ‌నిషీ అంతే అహంకార‌మ‌నే రూపం క‌మ్ముకుని ప‌నికిరానివారిలా ఉంటారు. కానీ త‌మ అంత‌రాత్మ‌ను మ‌ధించిన రోజున అస‌లు స్థితిని ద‌ర్శించ‌గ‌లుగుతారు. అంతేకాదు వెన్నను చేతిలో పెట్టుకోగానే ఇట్టే క‌రిగిపోతుంది. త‌న చెంత‌కు వ‌చ్చిన భ‌క్తుల‌ని చూసి, క‌న్న‌య్య మ‌న‌సు కూడా అలాగే క‌రిగిపోతుంది అనటానికి చిహ్నం.. దీనిని బోధించటానికి గోకులంలోని గోపిక‌ల ఇంట వెన్న రూపంలో నైవేద్యాన్ని ఆర‌గించేందుకూ క‌న్న‌య్య వెన్న‌ని దొంగ‌లించేవాడ‌ని అంటారు. ఇక గోవు ఎందుకు ప్రత్యేకమంటే.. 


క‌న్న‌య్య గోపాలుడు కాబ‌ట్టి ఆయ‌న చెంత గోవులు ఉండ‌టం స‌హ‌జ‌మే.భార‌తీయ సంస్కృతి, హైంద‌వ ధ‌ర్మాల‌లో గోమాత‌ ప్ర‌స్తావ‌న ఉంటుంది. అస‌లు గోత్రం అన్న మాటే గోవుల మంద నుంచి వ‌చ్చిందంటారు. భార‌తీయులు గోవుకి ఇంత‌గా ప్ర‌ముఖ్య‌త‌ని ఇవ్వ‌డానికి కార‌ణం.. గోవులు కేవ‌లం పాల‌కు, వ్య‌వ‌సాయానికి మాత్ర‌మే తోడ్ప‌డ‌టం లేదు… మ‌న మ‌న‌సుని తెలుసుకుని మసలుతుంటాయి కూడా.. హిందువులు గోవుల‌ను స్వ‌చ్ఛ‌మైన జీవులుగా, దేవతా స్వరూపాలగా భావిస్తారు. య‌జ‌మాని బాధ‌లో ఉన్న‌ప్పుడు తాను కూడా క‌న్నీరు పెట్టే జీవి గోవు ఒక్క‌టే. అందుకే క‌న్న‌య్య‌కు గోవులంటే అంత ఇష్టమట. అంత ఇష్టం కాబట్టే ఆ గోవులను రక్షించటానికి ఆయ‌న ఏకంగా గోవ‌ర్ధ‌న‌గిరినే ఎత్తి పట్టుకున్నాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: