బుగ్గనా.. తెలుగుకు ఈ అన్యాయం ఏంటి చెప్పన్నా?

బడ్జెట్ ప్రసంగం అంటే ఎందరో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఓ ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత‌్వం ఏం చేయదలచుకుంటుందో చెప్పే ప్రసంగం ఈ బడ్జెట్‌.. అయితే.. ఇలాంటి బడ్జెట్ ప్రసంగాలను ప్రారంభించే సమయంలో సాధారణంగా మహామహుల సూక్తులను కానీ.. పురాతన గ్రంధాల నుంచి మంచి మాటలను కానీ తీసుకుని వాటిని ప్రస్తావించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. అదే కేంద్ర బడ్జెట్‌ విషయంలో అయితే.. చిదంబరం, నిర్మలాసీతారామన్ లాంటి వారు.. ఎక్కువగా తమిళ పురాతన సాహిత్యం తిరుక్కురల్ నుంచి కొన్ని పాదాలను ఉటంకించడం చేశారు. అలా తిరుక్కురల్ ఇలాంటి ప్రసంగాల్లో చోటు దక్కడం జరిగింది.

చిదంబరం, నిర్మలా సీతారామన్ తర్వాత.. ప్రధాని మోడీ కూడా అనేక సార్లు తిరుక్కురల్‌ను ప్రస్తావించారు. అలా తమిళ ప్రాచీన సాహిత్యానికి దేశ వ్యాప్తంగా ప్రచారం లభించింది. విచిత్రం ఏంటంటే.. చిదంబరం, నిర్మలాసీతారామన్ వంటి వారు తమ మాతృభాష తమిళానికి అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రస్తావిస్తే.. మన తెలుగు మంత్రి, జగన్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం విచిత్రంగా ఏ నన్నయ, తిక్కన, పెద్దన, వేమన చెప్పిన సూక్తులను కాకుండా.. ఆయన కూడా తిరుక్కురల్ నుంచే సూక్తులు తీసుకుని వాటి ద్వారా బడ్జెట్‌ ప్రసంగాన్ని తయారు చేసుకోవడం మరో వివాదంగా మారే అవకాశం ఉంది.

తిరువళ్ళువర్ రాసిన తిరుక్కురల్ గొప్ప గ్రంథమే.. అందులో వివాదమే లేదు. కానీ.. మన బుగ్గన గారు  ప్రవేశపెడుతున్నది ఆంధ్ర ప్రదేశ్  బడ్జెట్ కదా.. తెలుగు నేల గురించిన ప్రసంగం కదా.. మరి ఆయన ప్రస్తావించడానికి తెలుగు సాహిత్యంలో పదాలే లేకపోయాయా.. అంతటి సూక్తులు మన తెలుగు కవులెవరూ రచించలేదా.. బుగ్గన ప్రస్తావించ తలుచుకుంటే వేమన శతకం నుంచి సుమతీ శతకం దాక ఎన్ని చక్కటి పద్యాలు లేవు.. తిక్కన భారతం నుంచి పోతన భాగవతం దాకా ఎంతటి తెలుగు సాహిత్యం లేదు.. బుగ్గన అలాంటివి ప్రస్తావించకుండా తమిళ తిరుక్కురల్ ను ప్రస్తావించడం అంటే భావ దారిద్ర్యం తప్ప వేరొకటి లేదంటున్నారు తెలుగు సాహితీ ప్రియులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: