జగన్.. ఎయిర్‌పోర్టులు తర్వాత.. ముందు రోడ్లు చూడు..!

Chakravarthi Kalyan
విశ్వసనీయత.. ఈ పదం ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా.. గతంలో జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు బాగా వాడిన పదం ఇది. ఆనాటి సీఎం చంద్రబాబుకు విశ్వసనీయత లేదని.. వైఎస్‌ఆర్‌కు విశ్వసనీయత ఉందని.. ఇచ్చిన మాట తప్పనని.. జగన్ తరచూ చెప్పేవారు.. ఇప్పుడు కాస్త సీన్ మారిపోతోంది.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తరచూ అధికారులతో సమీక్షలు నిర్వహించేవారు.. ప్రతి సమీక్ష తర్వాత సుదీర్ఘంగా ప్రెస్ మీట్‌ పెట్టేవారు.

తాను చేయబోయే అభివృద్ధి పనుల గురించి ఏకరువు పెట్టేవారు.. అంతే కాదు.. 2014లో చంద్రబాబు సీఎం అయిన తొలిరోజుల్లోనే ఏ జిల్లాకు ఏం చేయబోతానన్నది ఓ పెద్ద బ్లూ ప్రింట్ రూపొందించారు. దాన్ని అనుకూల మీడియాలో ఊదరగొట్టేశారు. కానీ.. తన పాలన పూర్తయ్యేనాటికి అందులో నాలుగోవంతు కూడా చేయలేకపోయారు. అమరావతి సంగతి కూడా అంతే.. అదిగో అమరావతి..ఇదిగో అమరావతి అంటూ హడావిడి తప్ప.. క్షేత్రస్థాయిలో జరిగిందేమీ లేదు.

ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడవబోతున్నారా అని కొన్నిసార్లు అనిపిస్తోంది. ఏపీలో రోడ్ల సంగతి అస్సలు బాగా లేదన్ని వాస్తవ పరిస్థితి. ఏపీలో రోడ్ల సంగతి గురించి సోషల్ మీడియాలో ఎన్ని జోకులు.. పేరడీలు.. సెటైర్లు.. మీమ్స్ ఉన్నాయో లెక్కే లేదు.. అయినా జగన్ ఈ విషయం గురించి సీరియస్‌గా పట్టించుకుంటున్నట్టు కనిపించదు. అలాంటి క్షేత్ర స్థాయి సంగతులు విస్మరించి.. జిల్లాకో ఎయిర్‌పోర్టు కడతాం అంటూ చంద్రబాబు తరహాలో ఊదరగొట్టే ప్రయత్నం ఇటీవల జరుగుతోంది.

దీంతో ఇప్పుడు ఏపీలో ముందు రోడ్ల సంగతి చూడండి. ఆ తర్వాత జిల్లాకో ఎయిర్‌పోర్టు కట్టొచ్చు అని సెటైర్లు వేస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. ముందు బస్టాండ్‌కు దిక్కులేదు కానీ.. జిల్లాకో ఎయిర్‌పోర్టు కడతాడంట అంటూ వెటకారం ఆడారు. చేతలకూ.. మాటలూ తేడా పెరిగితే.. ఇలాంటి విమర్శలే వస్తాయి. జనం కూడా ఇలాగే ఫీలయితే.. ఎన్నికల్లో ఫలితాలు మారిపోతాయని అధికార పక్షం గుర్తించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: