స్కూల్స్ స్టార్ట్.. తగ్గేదే..లే.. అంటున్న జగన్

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. సంక్రాంతి సెలవలు ముగించుకుని విద్యార్థులు బడిబాట పడుతున్నారు. అయితే.. సంక్రాంతి సెలవులు ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ సీన్ పూర్తిగా మారిపోయింది. సెలవులు ప్రకటించిన సమయంలో ఏపీలో రోజుకు 400-500 కరోనా కేసులు వస్తుండేవి.. కానీ ఇప్పుడు ఏపీలో రోజూ 4,500 వరకూ కరోనా కేసులు వస్తున్నాయి. ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ఏపీలోనే కాదు.. దేశమంతటా ఇలాగే ఉంది.. అందుకే చాలా రాష్ట్రాలు పాఠశాలలు మూసేశాయి. ఆన్‌ లైన్ క్లాసులకే మొగ్గుచూపుతున్నాయి. అయితే.. ఏపీ మాత్రం ఈ విషయంలో అస్సలు తగ్గడం లేదు. కరోనా కేసులు పెరుగుతున్నా.. ఇంకా పెరుగుతాయని సమాచారం ఉన్నా.. పాఠశాలల నిర్వహణకే జగన్ మొగ్గు చూపారు. అయితే.. ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే.. గతంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిలోనూ జగన్ క్లాసులు నిర్వహించారు. పాఠశాలలు మూసేయలేదు.

దేశంలో మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. ఈ విషయంలో జగన్ సర్కారు మాత్రం వీలైనంత వరకూ పాఠశాలలు నిర్వహించేందుకే నిర్ణయించారు. పాఠశాలల మూసివేత విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయన్నది జగన్‌ సర్కారు ఉద్దేశం. అలాగే గతంలో పరీక్షల నిర్వహణ విషయంలోనూ జగన్ సర్కారు ఇలాంటి వైఖరే ప్రదర్శించింది. కరోనా పరిస్థితులు ఉన్నా..  వీలైనంత వరకూ పాఠశాల కార్యక్రమాలపై ఆ ప్రభావం పడకుండా చూడాలన్న తాపత్రయమే మొదటి నుంచి కనిపించింది.

మిగిలిన రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి.. జనం ఏమనుకుంటారు.. తల్లిదండ్రుల్లో చెడ్డపేరు వస్తుందా..  ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందా.. వంటి శషభిషలకు జగన్ ఏ దశలోనూ ఆస్కారం ఇవ్వలేదు.  పిల్లల చదువుల విషయంలో ఏమాత్రం తగ్గేదే.. లే.. అంటూ ముందుకు వెళ్తున్నారు జగన్. కరోనా ప్రభావం పిల్లల చదువులపై సాధ్యమైనంత తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యకు తమ సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తుందంటున్నారు. ఆ విషయంలో జగన్‌ సర్కారును అభినందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: