హైదరాబాద్‌ టు ఆంధ్రా: బస్సులు, రైళ్లు కిటకిట!

Chakravarthi Kalyan
తెలుగు వారికి ఉన్న అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఇక ఆంధ్రావారికైతే ఇదే అతి పెద్ద పండుగ. అందుకే దీన్ని పెద్ద పండుగ అని కూడా పిలుచుకుంటారు. ప్రపంచంలో ఏమూల ఉన్నా ఈ పండుగకు మాత్రం సొంత ఊరికి రావాలని ప్రతి ఆంధ్రుడు కోరుకుంటాడు. అందుకు తగ్గట్టు తన ప్రయత్నాలు తాను చేసుకుంటాడు. అయితే.. అన్నిసార్లు రిజర్వేషన్లు కుదరవు. కానీ.. ఏదో ఒకలా సొంత ఊరికి చేరుకోవాలని తపించని ఆంధ్రుడు మాత్రం కనిపించడు.

అందుకే సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి పండుగకు వెళ్లే వారితో బస్సు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి కుంటుంబాలతో  సహా సొంతూళ్లకు జనం వస్తున్నారు. ప్రయాణికులతో విజయవాడ లోని  పండిట్ నెహ్రూ బస్‌ స్టేషన్‌ రద్దీగా మారింది. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.

అయితే.. ఏపీఎస్‌ ఆర్టీసీ రద్దీకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అదే సమయంలో కొవిడ్ వ్యాప్తి చెందకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మాస్కు ఉంటేనే బస్సుల్లో ప్రయాణానికి ఆర్టీసీ అనుమతిస్తోంది. ప్రయాణ ప్రాంగణాల్లో మాస్కు లేకుండా తిరిగితే ఆర్టీసీ సిబ్బంది జరిమానా విధిస్తున్నారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారితో విజయవాడ రైల్వేస్టేషన్లోనూ విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ కూడా పలుప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా రైళ్లు, రైలుస్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒమిక్రాన్ భయాలతో పండుగ ప్రయాణాలు తగ్గుతాయని భావించినా.. ఒమిక్రాన్ పై పండుగ ప్రేమే గెలిచింది. అందుకే బస్సులు, రైళ్లలో రద్దీ ఏమాత్రం తగ్గనే లేదు.  ఒమిక్రాన్‌ ఉన్నా .. తగ్గేదే..లే అంటూ జనం సొంతూళ్లకు బయలుదేరారు. ఎలాగోలా ఊళ్లో పడితే చాలు.. ఆ తర్వాత పండుగ సంబరాల్లో మునిగిపోవచ్చు అనుకుంటూ ఎన్ని ఇబ్బందులున్నా ప్రయాణాలకు మాత్రం తగ్గడం లేదు ఆంధ్రాజనం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: