జగన్‌ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వరట..?

Chakravarthi Kalyan
కృష్ణా జలాల వివాదం కొత్త మలుపులు తీసుకుంటోంది.. కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. కృష్ణానది మొదట తెలంగాణలో అడుగుపెట్టి.. జూరాలను దాటి శ్రీశైలానికి వెళ్తుంది.. అక్కడి వరకూ తెలంగాణ ఆధీనంలో ఉంటుంది. కానీ.. తుంగభద్ర కలిశాక కృష్ణమ్మ జోరు పెరుగుతుంది. ఆ తర్వాత శ్రీశైలం చేరుతుంది. అయితే.. శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంది. దీన్ని మరింత విస్తరించి ఇక్కడే రాయలసీమ ఎత్తిపోతల నిర్మించాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. పనులు మొదలు పెట్టింది.

రాయలసీమ ఎత్తిపోతలతో తెలంగాణ నీటి వాటాకు ఇబ్బంది వస్తుందని తెలంగాణ వాదిస్తోంది. అసలు రాయలసీమ కృష్ణా బేసిన్‌లోనే లేదని.. ముందు బేసిన్ అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు నీళ్లివ్వాలన్నది  తెలంగాణ వాదన. అయితే ఏపీ మాత్రం రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం ఆపడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాలను ఆపాలని, లేకుంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును కూల్చేస్తామని టీఎస్‌, ఓయూ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు.

అంతే కాదు.. ఈ నిర్మాణం ఆపకపోతే.. అసలు జగన్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. ఈ రెండు జేఏసీల సంయుక్త ఆధ్వర్యంలో ‘కృష్ణా, గోదావరి జలాలు.. ఆంధ్రా దోపిడీ, కేంద్రం పెత్తనం’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం  నిర్వహించారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ తేల్చిన నీటి వాటా తాత్కాలికమైనదేనని వీరు చెబుతున్నారు. ఆంధ్రా దాన్ని ఒక హక్కుగా చెబుతూ కృష్ణా జలాలను దోచుకునే ప్రయత్నం చేస్తోందని జేఏసీ నేతలు విమర్శిస్తున్నారు. నదీ జలాలపై ఏ రాష్ట్రాల్లో లేని నిబంధనలను కేంద్రం తెలుగు రాష్ట్రాలపై రుద్ది పెత్తనం చేయొద్దంటున్నారు.

అయితే.. ఇలా కూల్చేస్తాం.. తిరగనివ్వం.. అనే  తరహా ప్రకటనలు రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పెంచుతాయి. మంచి వాతావరణం చెడగొడతాయి. సమస్య పరిష్కారం దిశగా ఆలోచించి.. అనుసరణీయ పద్దతుల ద్వారా అడుగులు వేయడం అందరికీ మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: