కాటమరాయుడు.. కత్తి అందుకునేది ఎప్పుడో..?

Chakravarthi Kalyan
పవన్ కల్యాణ్.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినీ స్టార్.. కమ్‌ రాజకీయ నాయకుడు.. అంతే కాదు.. పవర్ పుల్ పొలిటికల్  డైలాగులతో అదరగొడతాడు.. ఆంధ్రాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటర్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయినా ఆయన స్థాపించిన జనసేన అడుగులు ముందుకు పడటం లేదు. అడపా దడపా చిన్నా చితకా కార్యక్రమాలు చేయడం తప్పించి.. జనసేనాని జనం మధ్యకు రావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కల్యాణ్‌ లో సీరియస్ పొలిటికల్ అప్రోచ్ కనిపించడం లేదు.

పవన్‌ చాలామంది సగటు రాజకీయ నాయకుల కంటే బెటర్.. చాలా మంది దోపిడీ మనస్తత్వం ఉన్న నేతలకంటే చాలా బెటర్. అందులోనూ సమాజానికి ఏదో చేయాలని తపన ఉన్న వాడు.. అందుకే కోట్లు కురిసే సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. ఇవన్నీ ఓకే.. మరి ఇంత చేస్తున్నప్పడు దాని ఫలితం వచ్చేలా ప్రయత్నం ఉండాలిగా.. ఫోకస్ సీరియస్‌గా ఉండాలి కదా.. కానీ.. అలాంటి ప్రయత్నం జనసేనాని నుంచి కనిపించడం లేదు.

సినిమాలా... రాజకీయాలా.. ఈ రెండు పడవలపై అడుగు పెట్టడమే పవన్ కల్యాణ్‌ పొలిటికల్ కెరీర్ ఇంత డల్‌గా సాగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే రాజకీయ పార్టీ నడపడానికి తన వద్ద కోట్లకు కోట్లు లేవని.. అందుకే సినిమాలు చేస్తున్నానని పవన్ చెబుతుంటారు. నిజంగా సీరియస్‌గా రాజకీయాలు నడపాలంటే.. కోట్లకు కోట్లు అవసరమా.. అన్న విషయం కూడా ఆలోచించాల్సిన విషయమే. పవన్ ఈ మాట అంటున్నప్పుడు..  ఢిల్లీలో కేజ్రీవాల్ ఏం కోట్లు గుమ్మరించాడు.. ఎంత పెట్టుబడి పెట్టాడు.. అన్న అంశం గుర్తుకొస్తుంది.

ఇప్పటికైనా పవన్ కల్యాణ్ సీరియస్‌గా రాజకీయాలపై దృష్టి సారించాలి. పార్ట్ టైమ్ పొలిటికల్ స్టార్‌గా మిగిలిపోకూడదు.. కాటమ రాయుడు కత్తి అందుకుని జోరు పెంచాలి.. రంగంలోకి దిగాలి.. అభిమానులు, కార్యకర్తలు కోరుకునేది ఇదే. మరి పవర్ స్టార్ ఏం చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: