మేమింతే.. మా అంత మూర్ఖులు ప్రపంచంలో ఉండరు..?

Chakravarthi Kalyan
మేమింతే.. ఎన్నో గొప్ప చదువులు చదువుతాం.. ఎన్నో పెద్ద ఉద్యోగాలు చేస్తాం.. ఎన్నో వ్యాపారాలు చేస్తాం.. వీడు సూపర్‌రా అన్నంత పేరు తెచ్చుకుంటాం.. మా తెలివితేటలతో ప్రపంచాన్నే అబ్బుర పరుస్తాం.. కానీ..  ఓ బాబా వచ్చి మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయంటే చాలు ఒళ్లు మైమరచిపోతాం.. ఆ బాబా అడిగినవన్నీ సమర్పించుకుంటాం.. నట్టింట్లో పాతాళం అందేలా తవ్వి చూస్తాం.. భక్తి విషయం వస్తే చాలు లాజిక్కులు మర్చిపోతాం.. మూర్ఖత్వంలో మమ్మల్ని మేమే మరచిపోతాం.

మేమింతే.. ఓ కొత్త బాబా కనిపిస్తే చాలు.. ఇక మా జన్మ ధన్యమైందని భావిస్తాం.. ఆ బాబాల సేవలో తరించిపోతాం.. ఏనాడూ ఎంగిలి చేత్తో కాకిని అదల్చని మేము బాబుల కోసం మాత్రం లక్షలు లక్షలు విరాళాలు ఇచ్చేస్తాం.. ఒక్క విరాళేంటి ఖర్మ.. బాబాలు అడిగితే.. వాళ్ల పక్కలోకైనా సరే.. సెకను కూడా ఆలోచించకుండా వెళ్లిపోతాం.. ఏంటి నమ్మకం కలగడం లేదా.. అయితే మొన్నటికి మొన్న నల్గొండ జిల్లాలో విశ్వ చైతన్య స్వామీజీ విషయమే తీసుకోండి.. సదరు బాబా ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌.. ఓ కంపెనీ పెట్టి దివాలా తీశాడు.

ఆ నష్టాల నుంచి కోలుకునేందుకు బాబా అవతారం ఎత్తాడు.. మేం ఇవన్నీ పట్టించుకోం కదా.. మాకు బాబా కనిపిస్తే చాలు.. మొక్కడమే.. సాగిలపడిపోవడమే.. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌లో కనిపించాడు. సాయి ప్రవచాలు చెబుతున్నాడు.. అంతే మేం ఆ మాయలో పడిపోయాం.. మా ఆస్తులు రాసిచ్చేశాం.. మాలో కొందరు భక్త మహిళామణులు అయితే.. ఆ స్వామీజీ కోరాడు కదా అని ఆయనతో లైంగిక సంబంధాలు కూడా పెట్టుకున్నారు. మాకు ఇవన్నీ తప్పుగా కనిపించవు.. ఆ స్వామే కోరాక అంతకుమించిన భాగ్యం ఏముందని ఆనందంగా భావిస్తాం.

ఇలా ఒక్క విశ్వ చైతన్య బాబాయే కాదు.. మేమింతే.. భక్తి కోసం పిల్లలనైనా చంపేసుకుంటాం.. భక్తి కోసం ఆస్తులు ధారపోస్తాం.. భక్తి కోసం సంసారాలు నాశనం చేసుకుంటాం.. మేమింతే.. మేం మారం..
‍( మూర్ఖ భక్తులపై కోపంతో... నిజమైన భక్తులు, స్వామీజీలకు క్షమాపణలతో..)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: