రేవంత్ భలే.. కేసీఆర్‌ రూటులోనే వెళ్తున్నాడే..?

Chakravarthi Kalyan
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్‌లో మళ్లీ జోష్ కనిపిస్తోంది. కసి, పట్టుదలతో కాంగ్రెస్ పునర్‌వైభవం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే.. ఆయన కేసీఆర్‌ కు చెక్‌ పెట్టేందుకు ఆయన రూట్‌లోనే వెళ్తున్నారని చెప్పాలి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా.. అన్నట్టు రేవంత్ రెడ్డి కేసీఆర్‌ పాత స్ట్రేటజీలను బాగా స్టడీ చేసినట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్ ను కొట్టాలంటే ముందు ఆయన వ్యూహాలు అర్థం చేసుకోవాలని భావించినట్టున్నారు... ఇప్పుడు రేవంత్ అదే అమలు చేస్తున్నారు.

ఇంతకీ ప్రస్తుతం రేవంత్ ఫాలో అవుతున్న కేసీఆర్ పాలసీ ఏంటంటారా.. 2014లో టీఆర్ఎస్ బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు తనకు అవసరమైనంత మెజారిటీ ఉన్నా కూడా ఇతర పార్టీల నేతలను తన పార్టీలో చేర్చుకున్నారు. అందుకు ఆయన ఓ అందమైన పేరు పెట్టారు.. అదే రాజకీయ పునరేకీకరణ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ జరగాలని కేసీఆర్ అప్పట్లో తరచూ చెప్పేవారు. అలా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి అనేక మందిని తన పార్టీలో చేర్చుకున్నారు.

కేసీఆర్ ఈ రాజకీయ పునరేకీకరణ ఎత్తుగడతో తెలంగాణ అభివృద్ధి సంగతేమో కానీ.. కేసీఆర్ అధికారం మాత్రం బలపడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పాలసీ అమలు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణకు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు కాగానే రేవంత్ రెడ్డి ముందు తన పార్టీలోని అందరు నేతలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాను పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడాన్ని వ్యతిరేకించిన వారిని కూడా కలుసుకున్నారు.

ఆ తర్వాత ఇతర పార్టీల నేతలను కూడా కలవడం మొదలుపెట్టారు. తాజాగా రేవంత్ రెడ్డి దేవేందర్ గౌడ్‌ను కూడా కలుసుకున్నారు. దేవేందర్ గౌడ్ రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా.. ఆయన్ను కలుసుకుని ఆయన్ను గౌరవించారు. కేసీఆర్‌ను వ్యతిరేకించే వారిని.. తెలంగాణ నాయకులను ఏకం చేసే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. మరి ఈ కేసీఆర్ పాత  స్ట్రేటజీ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: