మంచిమాట: ఉపాయం ఉంటే ఎవరినైనా బోల్తా కొట్టించవచ్చు..!

Divya
ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు పదిమంది పుణ్య స్నానానికని వెళ్లారు. ఎవరికీ ఈతరాకపోవడం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని మునకలు వేశారు. పైకిలేవగానే అరెరే! చేతులు విడిపోయాయే... మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు. ఓ సారి లెక్కపెడతాం!'అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు. వెంటనే ఒకటీ, రెండు, మూడూ... అని లెక్కపెడితే తొమ్మిది మంది లెక్కతేలారు. అది చూసి అతని పక్కవాడు మీకసలు లెక్కలు రావు.. నేను లెక్క పెడతా చూడండి. అని మళ్ళీ మొదలుపెట్టాడు. అప్పుడు తొమ్మిది మందే ఉన్నారు. మూడో అతనూ, నాలుగోఅతనూ లెక్కపెట్టిన ఇదే తంతు! అప్పటికే మన వాళ్ళలో ఎవరో గోదారిలో కలిసిపోయారు. అంటూ కొందరు ఏడవటం మొదలుపెట్టారు.

వీళ్ళ వాలకానంత ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు. ప్రతి శిష్యుడూ తనని తప్ప మిగతా వాళ్లందరినీ లెక్క పెడుతున్ననందు వల్లే తేడా వస్తోందని తెలుసుకున్నాడు. వాళ్ల దగ్గరికి వెళ్లి స్వాములూ! మీ లెక్కలో తప్పుఉంది.. అని చెప్ప బోయే అంతలోనే మూర్ఖుడా... నేను ఎవరనుకున్నావ్? పరమానందయ్య శిష్యులం! అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పు పట్టేది. పో.. పో! అంటూ తరిమేశారు. అక్కడ నుంచి వెళ్ళిపోతున్న టోపీల వ్యాపారికి ఒక ఉపాయం తట్టింది.

వెంటనే అయ్యల్లారా! నాదగ్గర ఉన్నవి మామూలుటోపీలు కావు.. మాయాటోపీలు వీటిని పెట్టుకొని ఆ టోపిలను మాత్రమే లెక్క పెట్టి చూడండి.. తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు! అన్నాడు సరే.. ఇలా తే! అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకొని వాటిని మాత్రమే లెక్క పెట్టారు. 10 టోపీలు లెక్క తేలాయి! మరో ఇద్దరు లెక్కపెట్టిన అంతే! అరే... అద్భుతం సుమీ! అనుకున్నారందరూ భలే టోపీ లోయ్! వీటి ధర ఎంత? అని అడిగాడు ఒక శిష్యుడు.. మామూలు కంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి, అయినాసరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు. మన ఊరు వెళ్ళేదాకా ఎవరూ వాటిని తీయకండి లేకుంటే తప్పిపోతారు! అనుకుంటూ వాళ్లు వెళ్ళటం చూసి... టోపీలమ్మే వ్యక్తి పడి పడి నవ్వు కున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: