మంచిమాట:సమయానికి తగ్గ తెలివి ఉంటే ఆపదలు రావు..?

Divya
ఒక రోజు రాజుగారు అడవికి వెళ్ళాడు. అక్కడ చాలా సేపు వేటాడి అలసిపోయి కొండపైనున్న ఒక చెట్టునీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయనకు అక్కడి ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. ఆయన గొప్ప చిత్రకారుడు.. అందుచేత అక్కడి అందాలను రంగులతో మేళవించి చక్కని చిత్రం గీయాలనుకున్నారు. వెంటనే వెళ్లి గుర్రానికి వేలాడుతున్న సంచి నుంచి చిత్రలేఖనానికి కావలసిన సామాన్ల నన్నింటిని తెచ్చుకొని చిత్రాన్ని తయారు చేశారు.
దాని అందానికి ఆయన ముగ్ధుడై అన్ని పక్కలనుండి చూసి ఆనందించాలని తలచి, మొదట కుడి పక్కకు, తర్వాత ఎడమ పక్కకు, మరల ఎదుటి వైపునకు వెళ్లి చూస్తున్నారు. కొంచెం కొంచెం వెనక నడుస్తూ దాని అందాన్ని చూసి సంబర పడసాగారు.. కానీ ఆయన వెనుక ఉన్నది. కొండ కోన.. అది దాటితే ఆయన లోయలోకి పడిపోవడం ఖాయం. కానీ ఆయన అది గమనించడం లేదు.
ఈ విషయాన్ని ఆ దారిన పోతున్న ఒక గొల్ల పిల్ల వాడు చూసాడు. వాడు చాలా తెలివైనవాడు. "అయ్యో! రాజుగారు లోయలో పడి పోతున్నారు. ఎట్లాగైనా ఆయన్ని రక్షించాలి"అనుకున్నాడు. ఒకవేళ కేకవేసి చెప్పు దామంటే ఆయన కంగారుపడి లోయలోకి తూలి పడవచ్చు. అందుచేత వానికోక ఉపాయం తట్టింది. వాడు గబగబా చిత్రాన్ని వేలాడదీసిన కొయ్య వద్దకు వెళ్లి చిత్రాన్ని పుటుక్కున చించేసాడు. రాజుగారు కోపంతో రుద్రుడై పోయి వాణి చెంపచెళ్ళు 'అనిపించాడు. తర్వాత 'ఎందుకిలా చేశావని'అడిగారు "మీరు కొండ కోన మీద నిలబడి ఉన్నారు. ఒక్క అడుగు వెనక్కి వేస్తే మీరు లోయలో పడి పోవటం కాయం. అందుచేత మిమ్మల్ని రక్షించడానికే నేనీ పనిచేశాను."అని చెప్పాడు వాడు.
రాజు గారు ఒకసారి వెనక్కి చూసి అవును నిజమే!"అని తమ తప్పు తెలుసుకున్నారు. ఆ పిల్లవానికి ధన్యవాదాలు చెప్పి తనతో పాటుగా తన రాజధానికి తీసుకొనిపోయి, అచ్చట వానికి విద్యాబుద్ధులను నేర్పించాడు. తర్వాత ఆ పిల్లవాడే అఖండ తెలివితేటలతో పెద్ద వాడై రాజుగారి ముఖ్యమంత్రి అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: