మంచి మాట: తెలివి ఎవరి సొంతమూ కాదు..!

Divya
ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఒక రోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి..నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికు వచ్చిందో నక్క..దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ అంతలో నక్క దాన్ని చూడనే చూసింది. వెంటనే తాబేలు కాళ్లు తలా లోపలికి లాక్కుని, కదలకుండా ఉండిపోయింది. నక్క దాని దగ్గరకు వచ్చి పట్టుకొని చూసింది. పైన డోప్ప గట్టిగా తగిలింది. తాబేలు ను తిరగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా.... నక్క తనని పరీక్షిస్తున్న అంత సేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరి బిగబట్టి కూర్చుంది.

ఇంతలో దానికో ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టి... 'అయ్యో నక్క బావా, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా..నా శరీరంలో పెసరంత మాంసం మైన తినలేవు అంది. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్లీ... 'నా శరీరం తీరే అంత నక్కబావా. నీటిలోంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడి పోతాను. మళ్లీ నీళ్లు తగిలాయ నుకో... వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టు. ఆ తరువాత కడుపారా నువ్వు నన్ను తినొచ్చు అని చెప్పింది. అసలే జిత్తులమారి నక్క మహా తెలివైంది కదా... అందుకే తాబేలు మాటలు నమ్మి నమ్మ నట్టు గానే తల ఊపింది.

తాబేలును నీళ్ళలో ఉంచి..పారి పోకుండా కాలితో తొక్కి పట్టుకుంది నక్క. కాసేపయ్యాక తాబేలు తెలివి గా 'నక్క బావా, నేను పూర్తిగా నానాను. కానీ, నువ్వు కాలు పెట్టినచోట మాత్రం నా శరీరం నానలేదు. అంది దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకొని ఉన్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున అక్కడ నుంచి నీటిలోకి జారుకుంది.. అంతే ..నా కన్నా తెలివైనది తాబేలు అనుకొని , చేసేదేమీ లేక తిరిగి వెళ్ళిపోయింది నక్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: