మంచిమాట: ఆపదలో ఉన్న వాడిని రక్షించినవాడే అసలైన మనిషి..!
నాగరాజుకు ఈత రాదు. ఎలాగైనా చంద్రంలాగా తాను కూడా ఈత కొట్టాలనుకుంటున్నాడు. వీలైనప్పుడల్లా ఈత నేర్చుకోవడానికి వెళ్ళటం మొదలు పెట్టాడు. ఒక రోజు సాయంత్రం చంద్రం తన స్నేహితుడితో కలిసి ఈత కొట్టడానికి నదికి వెళ్ళాడు. ఆరోజు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 'ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్ననదిలో ఈత కొట్టడం చాలా ప్రమాదం'అనుకుంటూ చంద్రం, అతని స్నేహితుడు ఇంటికి బయలుదేరారు. ఇంతలో వారికి నాగరాజు ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నాగరాజు, చంద్రం కోపంగా చూసుకుంటూ ముఖాలు తిప్పుకున్నారు.
నాగరాజు నది ఉధృతంగా ప్రవహిస్తోందనే విషయాన్ని గమనించకుండా నదిలో ఈతకు దిగాడు. నీరు వేగంగా ప్రవహిస్తుండడంతో నాగరాజు నదిలో కొట్టుకుపోసాగాడు. ప్రాణభయంతో "రక్షించండి... రక్షించండి..."అని అరిచాడు. ఆ అరుపులు విన్న చంద్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలో దూకాడు. నీటి ప్రవాహంలో కొట్టుకు పోతున్న నాగరాజును రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తనని చంద్రం కాపాడినందుకు రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు నాగరాజు.
ఇంటికి వెళ్తున్నప్పుడు... చంద్రాన్ని అతని మిత్రుడు "నువ్వు నాగరాజు గొడవ పడ్డారు కదా ..! మరి అతన్ని రక్షించటానికి నీ ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా నదిలోకి దూకావు ఎందుకు?"అని అడిగాడు..అప్పుడు చంద్రం.. నాకు ఈత వచ్చి కూడా నా కళ్ళ ముందు ఈత రానీ వాడు నీటిలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేక పోయాను. ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే? అతన్ని రక్షించే అవకాశం ఉండి కూడా రక్షించ లేక పోయాననే బాధ నన్ను జీవితాంతం వేధించేది. ఆ బాధ భరించడం కన్నా కొద్ది నిమిషాల తెగింపు నయం కదా! పైగా శత్రువైన సరే ప్రాణప్రాయంలో ఉంటే రక్షించి తీరాలి అన్నాడు చంద్రం. అతడి మంచి మనసును మిత్రుడు అభినందించాడు.