మంచిమాట: సమానం అనే మాటతో ఎంతటి కష్టమైనా తీరిపోతుంది..!

Divya
అనగనగా ఒక ఊరిలో మాధవ్, గోవింద్, రఘు అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. వారు ఒకసారి పెళ్ళికి మరో ఊరికి బయలుదేరారు. అక్కడికి చేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చేయాలి. నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టారు. నడిచి నడిచి బాగా ఆకలి వేయడంతో వారి దగ్గరున్న ఆహార పదార్థాలన్నీ సాయంత్రానికి అయిపోయాయి. రేపు మధ్యాహ్నానికి కానీ ఆ ఊరు చేరుకోలేం. కదా..! అప్పటివరకూ ఏం తినాలి అని ఆలోచించసాగారు. అంతలో వారికి పనస చెట్టుకి బాగా పండిన తీయటి వాసన వస్తున్న పనసపండు వేలాడుతూ కనిపించింది. గబగబా వెళ్ళి ముగ్గురు కలిసి పండును కోశారు. పనసపండును నేను ముందుగా చూశాను. కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వాలి. అని మాధవ్ అన్నాడు.
"ముగ్గురిలోనూ నేనే పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వడం సబబు"అని గోవింద్ అన్నాడు. ఇద్దరూ వాదించుకోవటం మొదలు పెట్టారు. మాటా మాటా పెరిగి తన్నుకునేంత వరకు వచ్చింది. అప్పుడు రఘు వారిద్దరిని ఆపి" చీకటి పడుతోంది.. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయమే లేచి వెళ్దాం. ఎవరికి ఎక్కువ వాట ఇవ్వాలో  దేవుడు నిర్ణయిస్తాడు. అని సర్ది చెప్పాడు.. మర్నాడు ఉదయం మాధవ్ , గోవింద్ లు త్వరగా నిద్ర లేచారు. దేవుడు నా కలలో కనిపించి నన్నే ఎక్కువ వాటా తీసుకోమని చెప్పాడు. అని మాధవ్ చెప్పాడు.
లేదు లేదు దేవుడు నా కలలో కనిపించి నన్నే పెద్ద వాటా తీసుకోమని చెప్పాడు. అని గోవింద్ చెప్పాడు.. ఇలా వీళ్లిద్దరు వాదించుకునప్పటికీ రఘు ఇంకా లేవలేదు.
మాధవ్,  గోవింద్ లు కలిసి రఘుని తట్టి నిద్ర లేపారు. "ఎందుకు ఇంత సేపు పడుకున్నావు?"అని ఇద్దరూ కలిసి రఘుని అడిగారు. "అప్పుడు రఘు నేను దేవుని మాటను కాదనలేక పోయాను. అందుకే ఇంత సేపు నిద్రపోయాను. రాత్రి దేవుడు నాకు కనిపించి పనసపండును నన్ను ఒక్కడినే తినేయ్ అని చెప్పాడు. కడుపునిండా తిని ఆలస్యంగా పడుకోవడం వలన త్వరగా మెలుకువ రాలేదు. అన్నాడు
ఎంత దేవుడు చెప్తే మాత్రం నువ్వొక్కడివే తినేసావా. మా కోసం చెరో 4 పనస తోనలైన అయినా ఉంచలేక పోయావా. అని రఘు ని తిట్టారు. ఎక్కువ కావాలని ఆశ పడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధ పడ్డారు. ఈసారి ఏదైనా దొరికితే ఎక్కువ వాటా కోసం దెబ్బలడకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుందని అనుకున్నారు.
అప్పుడు రఘు బాధపడకండి. పనసపండును నేను తినలేదు. మీరు దెబ్బలాడుకోకుండా సౌకర్యంగా ఉండటం కోసమే అబద్ధాలు చెప్పాను. అన్నాడు చెట్టు చాటున దాచి ఉంచిన పనస పండు ను తీసుకొచ్చాడు. దాన్ని చూసి మాధవ్, గోవింద్ సంతోషించారు. ముగ్గురు కలిసి పనసపండును సమానంగా పంచుకొని తిన్నారు. హుషారుగా నడుచుకుంటూ పెళ్లికి వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: