మంచిమాట: మనలో అప్రమత్తత లేనినాడు నష్టపోక తప్పదు..!

Divya
ఒక ఊళ్లో సోమరాజు ,రామరాజు అనే ఇద్దరు రైతులు ఉండేవారు. సోమరాజు పొలంలో దిగుడు బావి ఉండేది. ఆ నీటిని తన పొలానికి పెట్టుకొని చక్కగా పంటలు పండించుకునే వాడు. కానీ రామరాజు పొలంలో అలాంటి బావి ఏమీ లేదు. అందుకే సోమరాజును అడిగి ఆ బావి నీటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు. దాంతో అతని వద్దకు వెళ్లి మిత్రమా.... నీ బావి నాకు ఆరు నెలలకు అద్దెకు కావాలి.. నువ్వు కోరినంత కిరాయి ఇస్తాను అని చెప్పాడు. దానికి సోమరాజు సరే... అలాగే చేద్దాం అని రామరాజు దగ్గర కొంత బయానా తీసుకున్నాడు.

తీరా రామరాజు నీళ్లు తీసుకునే సమయానికి సోమరాజు వచ్చి.... అదేంటి నువ్వు బావిని మాత్రమే అద్దెకు తీసుకున్నావు కదా..! నీటిని కాదు. నీరు తీయటానికి వీల్లేదు అని గొడవ పడ్డాడు. సోమరాజు ప్రవర్తనతో కంగుతిన్న రామరాజు... గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి తనకు న్యాయం చెప్పాల్సిందిగా కోరాడు. అంతా విన్నాక బాగా ఆలోచించిన ఆ గ్రామ పెద్ద సోమరాజుని పిలిపించాడు. సోమ రాజు... నువ్వు అన్నది బానే ఉంది. అతను అద్దెకు తీసుకున్నది బావినే కానీ నీళ్లను కాదు. అందుకే నీ నీటిని నువ్వే తీసుకో నీరంతా ఖాళీ చేసి రామరాజుకు ఇస్తే మిగిలిన బావిని అతడు వాడుకుంటాడు అని చెప్పాడు.

అది విన్న సోమరాజూకు బుర్ర తిరిగిపోయింది. తప్పు తెలుసుకున్నాడు దాంతో డబ్బు కోసం ఆశపడి అలా మెలికపెట్టాను. దయచేసి నన్ను క్షమించండి. రామరాజు నా బావి నీటిని ఒప్పందం ప్రకారం వాడుకోవచ్చు అని చెప్పాడు. దాంతో సంతోషించిన రామరాజు... ఆ నీటిని తన పొలానికి పెట్టుకొని సంతోషంగా సాగు చేసుకున్నాడు. ఇక ఇదే కాదు డబ్బుకు ఆశపడి.. అమాయకులైన ప్రజలను ఎంతో మంది ఎన్నో రకాలుగా మోసం చేస్తున్న విషయం తెలిసిందే..కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా సరే అప్రమత్తంగా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని మనవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: