మంచిమాట: గొప్పలకు పోతే చిక్కులు తప్పవు..!

Divya
ఒకరోజున ఒక వస్తాదు.. రాజు గారి వద్దకు వచ్చాడు. అతడు రాజుగారితో రాజా నేను చాలా బలవంతుణ్ణి.. నేను ఒక్కసారి ఒక పర్వతాన్ని కూడా పైకి ఎత్తాను.. నేను రోజు వంద సేర్ల పాలు తాగుతాను. నేను సింహాలతో కూడా పొట్లాడాను అని చెప్పాడు.
ఆ కండలు తిరిగినవీరుని చూసి రాజుగారు చాలా మెచ్చుకున్నారు. ఇటువంటి వీరుడు నా రాజ్యంలో ఉంటే ముందు ముందు చాలా ఉపయోగం ఉంటుంది. అనుకొని రాజుగారు అతన్ని తన కొలువులో ఉద్యోగంలో నియమించారు.
నిజానికి ఆ వస్తాదుకు పనేమీ ఉండేది కాదు. మితిమీరిన తిండిమెక్కడం, శుభ్రంగా గుర్రుపెట్టి నిద్రపోవడం ఇట్లా కొన్నాళ్ళు గడిచింది.
అక్కడకు దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది. రాత్రి కాగానే తోడేళ్లు , పెద్ద పులుల వంటి క్రూర జంతువులు, ఆ రాజ్యం లోకి ప్రవేశించి అనేక పశువుల్ని,  మనుషుల్ని కూడా చంపి తినివేయసాగాయి. ప్రజలు వచ్చి రాజు గారి తో తమ కష్టాల్ని  తొలగించవలసినదని మొరపెట్టుకున్నారు. రాజు గారికి వస్తాదు అతని సాహసకృత్యాలు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే ఆయన వస్తాదుని పిలిపించి నీవు ఇదివరకు ఒక పర్వతాన్ని ఎత్తి అవతల పడవేసినట్లు చెప్పావు. అది నాకు గుర్తుంది. ఇప్పుడు మా రాజ్యంలో అడవిలో నున్న పర్వతం ఒకటి ఉంది. దాన్ని ఎత్తి ఎక్కడైనాపడ వేయాలి అని చెప్పారు..
అందుకు అంగీకరించాడు వస్తాదు. ఆ రోజు మామూలుకంటే ఎక్కువ తిండి తిని , బోలెడన్ని పాలు త్రాగాడు. ఇక  రాజుగారు, మిగతా ఉద్యోగులు తన వెంట రాగా.. వస్తాదు ఆ పర్వతం వద్దకు చేరుకున్నాడు. వెంటనే అతడు రాజుగారితో"మహారాజా! మీ మనుష్యుల చేత పర్వతాన్ని తవ్వించండి. అప్పుడు దానిని పైకెత్తి అవతల పడేస్తాను."అన్నాడు
రాజు గారికి పిచ్చెక్కిన నంత పనైంది. పర్వతాన్ని త్రవ్వడమేమిటి పూర్వం నీవే పర్వతాన్ని ఎత్తి పడ వేశానని చెప్పావు కదా? అని అడిగాడు రాజు గారు..అప్పుడు ఆ వస్తాడు.. ఔను..పర్వతాన్ని ఎత్తినట్లు చెప్పాను..కానీ నేనే త్రవ్వి పైకి ఎత్తాను అని చెప్పలేదు అన్నాడు.
అప్పుడు రాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. వీడి మాటలు నమ్మి అనవసరంగా వీడిని మేపాము. వీడిని తన్ని తరిమి వేయండి. ఇటువంటి కోతలరాయుడు మన రాజ్యంలో అవసరం లేదు అని చెప్పారు రాజు గారు. కాబట్టి గొప్పలకు పోయి చిక్కుల్లో పడకూడదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: