మంచి మాట : పెద్దల మాట పెరుగన్నం మూట ..

Divya
ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతనికి గోపి ఒక్కడే సంతానం. అందుచేత ఎప్పుడు అతడిని కంటికి రెప్పలాగా కాపాడుకొనేవాడు తండ్రి. కొడుకు పెద్దవాడయ్యాడు . ముసలితనంలో తండ్రిని బాధ పెట్టకూడదని కొడుకే వ్యవసాయం చేస్తున్నాడు. యువకుడు..శక్తివంతుడు.. అవటం చేత కొడుకు విరామం లేకుండా పొలంలో పని చేస్తుండేవాడు. ఆదాయం బాగానే ఉంది.. కానీ ఎండలో పడి విశ్రాంతి లేకుండా పని చేస్తే అతని ఆరోగ్యం చెడిపోతుందని తండ్రి బాధిస్తుంటేవాడు. ఎన్నోసార్లు కొడుకుతో బాబు విశ్రాంతి లేకుండా అదేపనిగా పని చేస్తుంటే నీ ఆరోగ్యం చెడిపోతుంది. నీడలో విశ్రాంతి తీసుకొని కొంచెం నీళ్లు తాగి పనిచేస్తుంటే బాగుంటుంది.
అనేవాడు.
ఇక పని పట్ల విధేయుడైన కొడుకు..నాన్న..! విశ్రాంతి కోసం నేను కూర్చుంటే , చివరకి నేను సోమరిపోతు గా మారి పోతాను. అందుచేత నా పనికి ఎప్పుడూ అడ్డు చెప్పవద్దు.  అనేవాడు.. మీ ఆరోగ్యం చెడిపోతుందని నేను అట్లా చెప్పాను. కానీ నిన్ను పూర్తిగా పని మాని వెయ్యమని అనలేదుగదా అన్నాడు తండ్రి ..నేను నీకు ఇంకా చిన్న పిల్లవాడిగా కనిపిస్తున్నానా.. నా ఆరోగ్యానికి ఏ లోటు రాదు. నాకు కావాల్సిన కండ బలం నాకు ఉంది. అన్నాడు కొడుకు
ఇప్పుడు నేను పడుతున్న బాధ నీకు అర్థం కాదు. రేపు పెళ్లయ్యాక నీకు ఒక కొడుకు పుడితే ఆనాడు తెలుస్తుంది. అని తన మనసులోనే ఎంతో బాధపడ్డాడు. రైతు..కొన్నాళ్ళ తరువాత గోపి కి పెళ్లయింది. ఒక సంవత్సరంలోనే తండ్రి కూడా అయ్యాడు. మనుమడిని ఎత్తుకొని ఎంతో మురిసిపోయే వాడు. ఒక రోజున రైతుకు  ఒక ఆలోచన వచ్చింది. తన మనుమడిని తీసుకొని కొడుకు పనిచేసే పొలం దగ్గరికి వెళ్ళాడు. తన మనుమడిని ఎండలో పడుకోబెట్టి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు.
పసివాడు ఎండ వేడికి తట్టుకోలేక ఏడుపు లంకించుకున్నాడు. ఏడుపు విని గోపి వెంటనే అక్కడికి పరుగు పరుగున వెళ్ళాడు. పిల్ల వాన్ని ఎత్తుకొని కోపంతో రుసరుసలాడాడు. నాన్న పెద్దవాడివి కానీ నీకు కొంచమైనా జ్ఞానం ఉందా..? చంటి వాన్ని అట్లా ఎండలు ఎందుకు పడుకో పెట్టావు . అని అడిగాడు
అందుకు ఆ రైతు నవ్వి.. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నేను ఇంతవరకు పడుతున్నది. నిన్ను ఎండలో పని చేయవద్దని చెప్పే వాడిని.  కొడుకు గా నువ్వు ఎప్పుడైనా నా సలహా పాటించావా ..నేను పడ్డ బాధ నీకు తెలియ చెప్పటానికే వీడిని  ఎండలో పడుకోబెట్టాను. అన్నాడు.
గోపి కి అప్పుడు అర్థం అయింది. తండ్రి తన  ఆరోగ్యం కోసం ఎంత తపన పడ్డాడో.. తాను ఆయన మనసును ఎంత నొప్పించాడో..ఆ రోజు మొదలు తండ్రి  చెప్పినంత  వరకే గోపి పని చేసి విశ్రాంతి తీసుకునే వాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: